ఎదులాపురం, నవంబర్ 16 ః గ్రూప్-3 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. 29 కేంద్రాలను ఏర్పాటు చేయగా.. 10,255 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ గౌష్ ఆలం సంబంధిత అధికారులతో సన్నాహక సమావేశాలను నిర్వహించి దిశానిర్దేశం చేశారు. పొరపాట్లకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 17, 18 తేదీల్లో నిర్వహించనున్న టీజీపీఎస్పీ గ్రూప్-3 పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా కార్యచరణ రూపొందించారు. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్స్‌లో పరీక్ష జరగనుండగా.. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉండనుంది. కాగా.. శనివారం ఆయా పరీక్ష కేంద్రాల్లో స్టిక్కరింగ్ వేయగా.. చీఫ్ సూపరింటెండెంట్ అరుణ్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
గ్రూప్-3 పరీక్షకు ప్రతిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ గౌష్ ఆలం తెలిపారు. పోలీసు బందోబస్తు ఏర్పాట్లపై శనివారం జిల్లా పోలీసు ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో సిబ్బంది చేయాల్సిన విధులపై మార్గనిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. అభ్యర్థులు కేంద్రాలకు నిర్ణీత సమయానికి ముందే చేరుకోవాలని, కేంద్రంలో విధులు నిర్వర్తించే ప్రతి వ్యక్తి కచ్చితంగా గుర్తింపు కార్డులను కలిగి ఉండాలని తెలిపారు. ఐదు రూట్లలో సీఐ స్థాయి అధికారి ఇన్చార్జిగా ఉంటూ ఎస్సై స్థాయి అధికారి ద్వారా నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తూ అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహిస్తారన్నారు. పరీక్ష పత్రాల, జవాబు పత్రాల తరలింపులో ప్రత్యేక పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేసి పకడ్బందీగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ బి.సురేందర్రావ్, గ్రూప్-3 నోడల్ అధికారి జగ్రాం, డీఎస్పీలు పోతారం శ్రీనివాస్, ఎల్.జీవన్‌రెడ్డి పాల్గొన్నారు.
నిర్మల్ అర్బన్, నవంబర్ 16 : నిర్మల్ జిల్లాలో గ్రూప్-3 పరీక్షకు అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 8,124 మంది అభ్యర్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకోగా.. 24 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచే పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతిస్తారు. నిమిషం నిబంధన అమలులో ఉండడంతో 9.30 గంటల తర్వాత ఎవరిని లోనికి అనుమతించరు. తొలిరోజు రెండు పరీక్షలు.. సోమవారం మూడో పరీక్షను నిర్వహించనున్నారు. ఈ పరీక్ష నిర్వహణకు 24 మంది ముఖ్య పర్యవేక్షకులు, 24 మంది శాఖాధికారులు, 10 మంది ఫ్లయింగ్ స్కాడ్, 338 మంది బయోమెట్రిక్ ఇన్విజిలేటర్లు, 63 మంది ఐడెంటిఫికేషన్ అధికారులను నియమించారు. పరీక్షను ప్రశాంతంగా నిర్వహించేందుకు కేంద్రాల్లో 144 సెక్షన్‌ను అమలు పర్చారు.