ఆదిలాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లాలో వానకాలం ప్రారంభానికి ముందే వర్షాలు పడుతుండడంతో అధికారులు జొన్నల కొనుగోళ్లను వేగవంతం చేశారు. మరో వారం రోజుల్లో రైతులు జిల్లాలో వ్యవసాయ పనులు ప్రారంభించనుండగా పంటను విక్రయానికి తీసుకుపోతున్నారు. జిల్లా కేంద్రంలోని ఆదిలాబాద్ మార్కెట్ యార్డుతోపాటు ఇతర మార్కెట్ యార్డుల్లో ఆదివారం పంట కొనుగోళ్లు జరిగాయి. యాసంగిలో రైతులు సాగు చేసిన జొన్న పంట దిగుబడులు ఎకరానికి 15 క్వింటాళ్ల వరకు వచ్చాయి. మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో 10 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి ప్రాథమిక సహకార సంఘాల ద్వారా పంటను సేకరిస్తున్నారు. అధిక దిగుబడుల కారణంగా మార్కెట్ యార్డులతోపాటు కొనుగోలు కేంద్రాల్లో రైతులు భారీగా జొన్నలను విక్రయించడానికి తీసుకొస్తున్నారు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డుకు వివిధ మండలాల నుంచి పంట ఎక్కువగా వస్తుండడంతో కొత్తగా సాత్నాల మండలంలోని మేడిగూడ, భోరజ్ మండల కేంద్రాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులు వద్ద నుంచి పంటను సేకరిస్తున్నారు.
యాసంగిలో రైతులు సాగు చేసిన జొన్నలను ఈ నెల 31వ తేదీ వరకు కొనుగోలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. మార్క్ఫెడ్ కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధర క్వింటాలుకు రూ.3371తో కొనుగోలు చేస్తున్నారు. ప్రైవేటు వ్యాపారులు క్వింటాలుకు రూ.2600 చెల్లిస్తుండడంతో రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు పంటను తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. వర్షాల నేపథ్యంలో పంటలో తేమ శాతాన్ని పరిశీలించి కొనుగోలు చేస్తున్నారు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో ఇప్పటి వరకు ఒక లక్ష క్వింటాళ్ల జొన్నలను కొనుగోలు చేశారు. మరో 25 వేల క్వింటాళ్ల పంట విక్రయానికి వచ్చే అవకాశం ఉందని కొనుగోలు కేంద్రాల సిబ్బంది తెలిపారు. రైతులు తేమ, చెత్త, చెదారం లేకుండా జొన్నలను తీసుకొస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని, నిబంధనల మేరకు పంటను మార్కెట్ యార్డుకు తీసుకురావాలని అధికారులు సూచిస్తున్నారు.