తాండూర్ : తాండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రేచిని గ్రామంలో బుధవారం ఫర్టిలైజర్ ( Fertilizer ) , విత్తన దుకాణాలను పోలీసు, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు (Surprise inspection) నిర్వహించారు. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ కుమారస్వామి, బెల్లంపల్లి ఏడీఏ రాజనరేందర్ మాట్లాడారు. ఫర్టిలైజర్ దుకాణ యజమానులు రైతులకు నకిలీ విత్తనాలను ఎట్టి పరిస్థితుల్లో విక్రయించరాదన్నారు.
రైతులు నకిలీ పత్తి విత్తనాలు ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదని సూచించారు. గుట్టుచప్పుడు కాకుండా పంట పొలాల్లో నకిలీ విత్తనాలు నాటినట్లు సమాచారం అందితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతీ రైతు ఫర్టిలైజర్ దుకాణాల్లో వ్యవసాయానికి సంబంధించిన ఏ విత్తనాలు తీసుకున్న తప్పనిసరిగా రసీదును తీసుకోవాలని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటిస్తే అధిక దిగుబడి రావడంతో పాటు లాభాలు కూడా వస్తాయని వివరించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి కే సుష్మ, తాండూర్ ఎస్సై డి కిరణ్ కుమార్, శిక్షణ ఎస్సై అనూష పాల్గొన్నారు.