కౌటాల, డిసెంబర్ 28 : ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు అష్టకష్టాలు పడాల్సి వస్తున్నది. తేమ పేరిట సాకులు చెబుతూ కొనుగోళ్లు చేపట్టకపోవడంతో రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద నిరీక్షించాల్సిన పరిస్థితి దాపురించింది. ఇకనైనా సర్కారు స్పందించి వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వడ్లు కొనుగోలు చేయాలని రైతాంగం వేడుకుంటున్నది.
45 రోజులు దాటుతున్నా..
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలో ఏడు వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. పంట కోసి 45 రోజులు దాటుతున్నా తేమ పేరిట కొనుగోళ్లు చేపట్టకపోవడంతో రైతులు వీరవెల్లి, సాండ్గాం, కుంభారీ, కౌటాల, గుడ్లబోరి కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొన్నది. ప్రభుత్వం 17 శాతంకన్నా తక్కువగా తేమ ఉంటేనే కొంటున్నది. వరి ధాన్యాన్ని ఎంత ఆరబెడుతున్నా చలి కాలం కావడంతో తేమశాతం తగ్గడం లేదు. 18 నుంచి 25 వరకు తేమ శాతం వస్తుంది. పగలు ఎండ తీవ్రత ఉన్నప్పటికీ రాత్రి మంచు కురుస్తుండడంతో తేమ శాతం పడిపోతున్నది. ఉదయం తిరిగి వడ్లను ఆరపెట్టినా ఫలితం లేకుండా పోతున్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తేమ శాతం తగ్గితేనే కొంటామని అధికారులు చెప్పడం, ప్రస్తుత పరిస్థితుల్లో వడ్లు తేమ శాతం తగ్గకపోవడంతో రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద నానాతంటాలు పడుతున్నారు. ఇక కొనుగోలు కేంద్రాల వద్ద స్థలం లేక కొందరు రైతులు పొలాల వద్దే వడ్లను ఆరపెట్టుకుంటున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రాత్రీ పగలూ పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం సన్నరకాలకు క్వింటాలుకు రూ. 2389తో పాటు రూ. 500 బోనస్, దొడ్డు రకాలకు క్వింటాలుకు రూ. 2369గా ధర నిర్ణయించింది. సర్కారుకు అమ్మితే పంటకు తగిన ఫలితం దక్కుతుందని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నప్పటికీ తేమ పేరిట ఇబ్బందులు పెడుతుండడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇకనైనా అధికారులు స్పందించి వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని తేమ శాతం పేరిట ఇబ్బందులు పెట్టకుండా కొనుగోలు చేయాలని రైతులు వేడుకుంటున్నారు.
సాకులు చెబుతున్నరు
నానా తంటాలు పడి పంట తీస్తే కొనేటోళ్లు లేరు. వరి కోసినప్పటి నుంచి ఇంత వరకు అమ్ముడుపోకపాయే. మస్తు తిప్పలైతంది. పొద్దుగాల పోయి వడ్లు ఆరబెట్టడం.. తిరిగి సాయంత్రం కుప్ప పోయడమే అయితంది. తేమ పేరిట ఇలా ఇబ్బందులు పెట్టడం సరికాదు. ఇవే వడ్లను మేము రైస్ మిల్లుల్లో పట్టిస్తే బియ్యం మంచిగైతన్నయి. కానీ కొనుగోలు కేంద్రంలో మాత్రం సాకులు చెబుతూ కొంటలేరు.
– మోర్లె మోహన్రావు, రైతు, సైదాపూర్
పొద్దంతా వడ్లకాడే ఉండుడైతంది
సార్లు తేమ పేరిట వడ్లు కొంటలేరు. రోజూ పొద్దున వడ్లు ఆరబెట్టడం.. సాయంత్రం తిరిగి కుప్ప చేయడంతోనే పొద్దంతా పోతుంది. పనులన్నీ వదులుకొని వడ్లకాడే కావలి ఉండాల్సి వస్తున్నది. పంట అమ్ముదామంటే తేమ పేరిట సాకులు చెప్పవట్టే. ఇగ గిట్లయితే వడ్లు ఎప్పుడు అమ్ముడు.. ఇగ వేరే పంట ఎప్పుడు వేసుడు. ఇప్పటికే 45 రోజులైతంది. ఇకనైనా సర్కారోళ్లు దయచూపి వడ్లను కొనాలి.
– పుల్గం అంజన్న, రైతు, సైదాపూర్
మంచుకు వడ్లు మొలకలొస్తున్నయి..
రోజూ మంచుతోటి వడ్లు మొలకలొస్తున్నాయి. ఇన్ని రోజుల సంది వడ్లు ఎండబెట్టిన. కానీ అధికారులు సాకులు చెబుతూ కొంటలేరు. మస్తు తిప్పలైతంది. గిట్లా ఎప్పుడు కాలే. వడ్లు మొత్తం ఎలుకలు బుక్కుతున్నయి. ఇకనైనా సార్లు మా బాధలను చూసైనా వడ్లు కొని న్యాయం చేయాలి.
– ఇసంపల్లి సంతోశ్, రైతు, గుడ్లబోరి