ఇంద్రవెల్లి, జనవరి 25 ః ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలానికి ఈ నెల 27, 28, 29 తేదీల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటనకు వచ్చే అవకాశాలు ఉన్నాయని, ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని ఎస్పీ గౌస్ ఆలం పేర్కొన్నారు. గురువారం మండలంలోని అమరవీరుల స్తూపం ప్రాంతంలోని ఖాళీ స్థలంతోపాటు కేజీబీవీ పాఠశాల గ్రౌండ్, ఐపీఎస్ పాఠశాలలోని హెలిప్యాడ్ గ్రౌండ్, కేస్లాపూర్ నాగోబా ఆలయ పరిసరాలను ఐటీడీఏ ఇన్చార్జి పీవో ఖుష్బు గుప్తాతో కలిసి ఎస్పీ పరిశీలించారు. సీఎం పర్యటన సందర్భంగా సమస్యలు లేకుండా అధికారులు, పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.
వాహనాల పార్కింగ్, ప్రజలతో బహిరంగా సభ నిర్వహించేందుకు సరి పడా స్థలంతోపాటు హెలిప్యాడ్ కోసం స్థలాన్ని ఎంపిక చేయాలని ఆదేశించారు. బందోబస్తుతోపాటు ప్రత్యేక భద్రత, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసు కోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ ఆర్డీవో జీవాకర్‌రెడ్డి, ఐటీడీఏ డీడీ దీలిప్‌కుమార్, ఐటీడీఏ ఈఈ భీం రావ్, ఉట్నూర్ డీఎస్పీ నాగేందర్, సీఐ రామకృష్ణ, డీఎ ల్పీవో భిక్షపతిగౌడ్, తహసీల్దార్ ప్రవీణ్‌కుమార్, ఎంపీడీవో పుష్పలత, డిప్యూటీ తహసీల్దార్ రమేశ్, ఎస్ఐ సునీల్, గిర్దావర్ మెస్రం లక్ష్మణ్, ఈవో సంజీవరావ్ పాల్గొన్నారు.