ఎదులాపురం, మే 30 ః క్షుద్ర పూజల పేరిట మహిళపై అసభ్యకరంగా ప్రవర్తించిన క్షుద్ర మాంత్రికుడిని అరెస్ట్ చేసినట్లు ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం వన్ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో సీఐ సునీల్‌కుమార్‌తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. బ్రాహ్మణవాడకు చెందిన మహిళకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి.
దీంతో అదే కాలనీకి చెందిన రమేశ్ మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా సక్రాని గ్రామానికి చెందిన క్షుద్ర మాంత్రికుడు అభినయ్ కుమార్ గురించి బాధిత కుటుంబ సభ్యులకు చెప్పాడు. బాధిత మహిళకు నాగదోషం ఉందని, క్షుద్ర పూజలు చేయాలని బాధితులకు అభినయ్ కుమార్ నమ్మ పలికాడు. అయితే శుక్రవారం బాధితురాలి ఇంట్లో క్షుద్ర పూజలు చేయాల్సి ఉంటుందన్నారు.
గదిలో మహిళను ఒంటరిగా ఉంచి, కుటుంబ సభ్యులను బయటకు వెళ్లాలన్నాడు. గదిలో నుంచి కొద్దిసేపటికే మహిళ కేకలు వినబడిన వెంటనే కుటుంబ సభ్యులు లోపలికి వెళ్లిన సందర్భంలో మహిళపై అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇచ్చిన ఫిర్యాదు మేరకు అభినయ్ కుమార్‌ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.