‘సీఎం కేసీఆర్ ప్రజల కష్టాలు తెలిసిన మహా మనిషి. ఖానాపూర్ నియోజకవర్గం నుంచి నాకు పోటీ చేసే అవకాశం కల్పించినందు కు కృతజ్ఞతలు తెలుపుతున్నా. నేను మీ బిడ్డనే.. మీ కష్టసుఖాల్లో ఒకడిగా ఉంటా. నన్ను భారీ మెజార్టీతో గెలిపించండి. నా గెలుపును సీఎం కేసీఆర్ సార్‌కు కానుకగా ఇద్దాం..’ అని ఖానాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి భూక్య జాన్సన్ నాయక్ పేర్కొ న్నారు. బీఆర్ఎస్ టికెట్ కేటాయిం చిన తర్వాత బుధవారం మొదటిసారి నియోజకవర్గ కేంద్రానికి రావడంతో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు అపూర్వ స్వాగతం పలికారు. డప్పు చప్పుళ్లు, పటాకులు కాలుస్తూ పది వేల మందితో భారీ ర్యాలీ తీశారు. పట్టణం కోలాహలంగా మారగా.. గులాబీ జెండాలు రెపరెపలాడాయి. ఈ సందర్భంగా భూక్య జాన్సన్ నాయక్ తెలంగాణాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
ఖానాపూర్, ఖానాపూర్ టౌన్, ఖానాపూర్ రూరల్, ఆగస్టు 23 : రాష్ట్రంలోని ప్రజల కష్టాలు తెలిసిన మనిషి సీఎం కేసీఆర్ అని ఖానాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి భూక్యా జాన్సన్‌నాయక్ అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి తొలిసారిగా ఖానాపూర్ పట్టణానికి ఆయన రావడంతో నియోజకవర్గ పార్టీ శ్రేణులు డీజే చప్పుళ్లు, డప్పు వాయిద్యాలతో, మంగళహరతులతో, పటాకులు కాలుస్తూ ఘన స్వాగతం పలికారు. మహిళలు వీరతిలకం దిద్దగా…అడుగడుగునా అవ్వలు దీవెనార్థులు ఇచ్చారు. ముందుగా నిర్మల్ జిల్లా సరిహద్దు ప్రారంభంలో 10వేల మందితో స్వాగత ర్యాలీని ప్రారంభించి బాదనకుర్తి శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. బాదనకుర్తిలో పార్టీ కార్యకర్తలు గజమాలను క్రేన్ సహాయంతో జాన్సన్ నాయక్‌కు వేశారు. అనంతరం సూర్జపూర్, మస్కాపూర్ గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు శాలువాతో సన్మానించారు. ఖానాపూర్‌లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో జరిగే ఎన్నికల్లో తనను అశీర్వదించి సీఎం కేసీర్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. తెలంగాణ చౌరస్తా నుంచి ఆయన నివాసం వరకు బీఆర్ఎస్ శ్రేణులు భారీ ర్యాలీలో తీసి సంబురాలు చేసుకున్నారు. కార్యక్రమంలో ఖానాపూర్, కడెం, దస్తురాబాద్, పెంబి, జన్నారం, ఇంద్రవెల్లి, ఉట్నూర్ మండలాల బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
పట్టణంలోని తెలంగాణ చౌరస్తా వద్ద ఖానాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి భూక్యా జాన్సన్‌నాయక్‌ను ఎమ్మెల్సీ దండె విఠల్ మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్, ఖానాపూర్, సత్తనపల్లి పీఏసీఎస్ చైర్మన్లు ఇప్ప శ్రీనివాస్‌రెడ్డి, అమంద శ్రీనివాస్, వైస్ చైర్మన్ కరిపె శ్రీనివాస్, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుడు బండారి కిశోర్, ఎంపీపీ అబ్దుల్ మోయిద్, వైస్‌ఎంపీపీ వాల్సింగ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాజగంగన్న, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు ఆయనను కలిసి స్వాగతం పలికారు. కార్యక్రమంలో నాయకులు శ్రావణ్, పాల సంతోష్, తుప్ప నరేందర్, బల్గం రమేశ్, దివాకర్, సంద రాకేశ్, బీఆర్ఎస్ ప్రజప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.