నిర్మల్, మే 3(నమస్తే తెలంగాణ) : రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో సమ్మె సైరన్ మోగనున్నది. తెలంగాణ ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో గత జనవరి 27వ తేదీన ప్రభుత్వానికి సమ్మె నోటీసు అందించారు. యాజమాన్యం, ప్రభుత్వం, లేబర్ కమిషన్ నుంచి స్పందన రాకపోవడంతో గత ఏప్రిల్ 7వ తేదీన ‘చలో లేబర్ కమిషన్’ కార్యాలయం చేపట్టారు. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని లేబర్ కమిషన్ కార్యాలయానికి తరలివెళ్లి సమ్మె తేదీని ప్రకటించారు.
21 డిమాండ్లతో కూడిన సమ్మె నోటీసును కార్యాలయంలో అందజేశారు. నెలలోగా తమ డిమాండ్లకు పరిష్కారం చూపకుంటే సమ్మెకు దిగుతామని నోటీసులో పేర్కొన్నారు. కార్మికుల డిమాండ్లపై ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో ఈ నెల 7వ తేదీ నుంచి సమ్మెలో పాల్గొంటున్నట్లు కార్మిక సంఘాల నాయకులు ప్రకటించారు.
గత కేసీఆర్ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు అసెంబ్లీ తీర్మానం చేసింది. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆర్టీసీ కార్మికులకు అనేక హామీలిచ్చింది. తాము అధికారంలోకి రాగానే కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు గడుస్తున్నా తమ సమస్యలకు పరిష్కారం దొరకకపోవడంతో సమ్మెకు దిగుతున్నట్లు ఆర్టీసీ సంఘాల నాయకులు చెబుతున్నారు.
గత కొంతకాలంగా సమస్యల సాధన కోసం ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళన కార్యక్రమాలు చేసినప్పటికీ ప్రభుత్వంలో కనీస చలనం రాలేదు. ఇప్పటికే సమ్మె నోటీసు అందజేసిన ఆర్టీసీ జేఏసీ ఈ నెల 7వ తేదీ నుంచి సమ్మెబాట పట్టేందుకు సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నది. శుక్రవారం నిర్మల్ డిపో పరిధిలో తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏఆర్ రెడ్డి నేతృత్వంలో సమ్మె సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సమ్మెకు సన్నద్ధం కావాలని కార్మికులకు పిలుపునిచ్చారు. న్యాయమైన డిమాండ్లను సాధించుకునే వరకు ప్రభుత్వంపై పోరాడేందుకు కార్మికులంతా ఏకతాటిపైకి వస్తున్నారు.
ఈ నెల 7 నుంచి సమ్మె..
ఈ నెల 7 నుంచి ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు దిగుతుండడంతో బస్సులన్నీ డిపోలకే పరిమితం కానున్నాయి. జిల్లాలో నిర్మల్, భైంసా పట్టణాల్లో ఆర్టీసీ బస్సు డిపోలు ఉండగా, ఆయా డిపోల పరిధిలో దాదాపు 220 బస్సులు ఉన్నాయి. నిర్మల్ డిపోలో 147 బస్సులు ఉండగా, 427 మంది కార్మికులు పని చేస్తున్నారు.
అలాగే భైంసా డిపోలో 70 బస్సులు ఉండగా, ఇక్కడ 320 మంది కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. అయితే సమ్మె కారణంగా బస్సులు బయటకు రాకపోతే ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నది. పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు ఎక్కువగా ప్రయాణించే ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేకపోతే ప్రయాణం భారంగా మారనున్నది. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా నాన్చివేత ధోరణి అవలంబిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై అటు కార్మికులతోపాటు ప్రజలు మండిపడుతున్నారు.
ప్రధాన డిమాండ్లు..
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి..
గత కేసీఆర్ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఆ మేరకు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేసి వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో విలీన అంశం ఉన్నప్పటికీ ఆర్టీసీ ఉద్యోగులను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఎలక్ట్రానిక్ బస్సులను హైర్ చేసుకుని డిపోలన్నింటినీ ప్రైవేటు పరం చేయాలని చూస్తున్నారు. ప్రభుత్వమే ఈవీ బస్సులను కొనుగోలు చేయాలి. కారుణ్య నియామకాలు పొందిన వారికి మూడేండ్లపాటు కాంట్రాక్టు ఉద్యోగులుగా పరిగణిస్తున్నారు. దీనిని రద్దు చేసి రెగ్యులర్ చేయాలి.
– ఏఆర్ రెడ్డి, టీఎంయూ రాష్ట్ర అధ్యక్షుడు
కార్మికుల సమస్యలు పరిష్కరించాలి..
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన హామీలను అమలు చేసి కార్మికులను ఆదుకోవాలి. గత 16 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల ఒక్క సమస్యను కూడా పరిష్కరించలేదు. తమ న్యాయమైన డిమాండ్లను సాధించుకునే వరకు ప్రభుత్వంతో పోరాడుతాం. ఆర్టీసీని నిర్వీర్యం చేసి ప్రైవేటు పరం చేసేలా ఈ ప్రభుత్వ చర్యలు ఉన్నాయి. సమస్యల సాధనకు రాజీపడే ప్రశ్నేలేదు. ఈ నెల 7వ తేదీ నుంచి సమ్మెలో పాల్గొనాలని ఇప్పటికే కార్మికులను సన్నద్ధం చేశాం.
– ఆర్. గంగాధర్, టీఎంయూ జిల్లా కార్యదర్శి