బోథ్, నవంబర్ 24 : బోథ్-నిర్మల్ ప్రాంతాల మధ్య దూరభారాన్ని తగ్గించేందుకు నిర్దేశించిన అడెల్లి రోడ్డు నిర్మాణ పనులు పూర్తికాక పోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఘాట్ ప్రాంతంలో రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రఘునాథ్పూర్ అటవీ ప్రాంతంలోని 11 నుంచి 17 కిలో మీటర్ల వరకు ఉన్న సుమారు ఆరు కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం కోసం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 2021-22 ఆర్థిక సంవత్సరంలో (నాబార్డు ఆర్ఐడీఎఫ్-ఎక్స్ఎక్స్వీఐ కింద) రూ.9.80 కోట్లు మంజూరు చేసింది. పనులు చేజిక్కించుకున్న కాంట్రాక్టర్ ఘాట్ కటింగ్ పనులు పూర్తి చేశారు. రోడ్డుపై మట్టి, మొరం పోయించి తాత్కాలికంగా రాకపోకలకు వీలు కల్పించారు. ఘాట్ ప్రాంతంలో బీటీ రోడ్డు నిర్మాణం కోసం నిధులు మంజూరుకాకపోవడంతో పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. ఏ కొద్ది పాటి వర్షం కురిసిన ఘాట్ ప్రాంతంలోని మట్టి రోడ్డు బురదమయంగా మారుతుండడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. బీటీ రోడ్డు నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేసి పూర్తి చేయించాలని ఇరు ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు. మరోవైపు ఖండిపల్లె నుంచి రఘునాథ్పూర్ అడవి వరకు నిర్మించిన బీటీ రోడ్డు గుంతలమయంగా మారింది. ఆటోలు, ద్విచక్రవాహనాలు, జీపులు తదితర వాహనదారులు దెబ్బతిన్న రోడ్డు మూలంగా అవస్థలు పడుతున్నారు. రోడ్డు విషయమై రోడ్లు, భవనాల శాఖ ఈఈ నర్సయ్యను సంప్రదించగా మిగిలిపోయిన మూడు కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం కోసం రూ 2.60 కోట్లతో ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. ఘాట్ ప్రాంతంలో 700 మీటర్ల పాటు సీసీ రోడ్లు, మిగిలిన 2.300 కిలోమీటర్ల బీటీ రోడ్డు కోసం ప్రతిపాదించామన్నారు. నిధులు విడుదల కాగానే టెండర్లు పిలిచి పనులు చేయిస్తామని తెలిపారు.