కుభీర్ : ఇటీవల కురిసిన భారీ వర్షాల ( Rains ) కారణంగా వరదల వల్ల నష్టపోయిన పంటలను ప్రభుత్వం సర్వే ( Survey ) చేయాలని వ్యవసాయ శాఖను ఆదేశించడంతో నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలో (Kubheer mandal ) వ్యవసాయ విస్తీర్ణ అధికారులు ( AEOs ) సర్వేను చేపడుతున్నారు. ఈ క్రమంలో మండలంలోని పలు మారుమూల గ్రామాలకు నెట్వర్క్ సమస్య కొన్నేళ్లుగా వేధిస్తూ వస్తుంది. దీంతో మండలంలోని సిరిపెల్లి నెం1 , 2, 3 గిరిజన తండాలతో పాటు ఫకీర్ నాయక్ తండాలో రెండు రోజులుగా సర్వేకు వచ్చిన ఏఈవోలు నెట్వర్క్ అందక ఫీల్డ్ సర్వేలో ఇబ్బందులు పడుతున్నారు.
తాజాగా శుక్రవారం ఫకీర్ నాయక్ తండాలో పంట నష్టం పై ఫీల్డ్ సర్వేను నిర్వహిస్తున్న ఏఈవో జగదీష్ గిరిజన తండాలోని పలు పశువుల పాకలపై నిచ్చెన సాయంతో ఎక్కి సర్వేను నిర్వహించారు. అయిన గాని సిగ్నల్స్ కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి రావడం తో అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు బీఎస్ఎన్ఎల్ కొద్ది రోజుల క్రితం టవర్ను ఏర్పాటు చేసినప్పటికీ కొత్తగా తీసుకున్న మొబైల్ ఫోన్లకు మాత్రమే తక్కువ రేంజ్లో నెట్వర్క్ అందుతోంది.
ఇక పాత మొబైల్ ఫోన్లకు అసలు నెట్వర్క్ రావడం లేదని గిరిజనులు ఆరోపించారు. దూర ప్రాంతంలో చదువుకుంటున్న తమ పిల్లలతో , బంధువులతో మాట్లాడాలన్నా గుట్టమీదకు వెళ్లడం, లేదా మిషన్ భగీరథ ట్యాంక్పై ఎక్కి మాట్లాడాల్సిన పరిస్థితులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గిరిజన గ్రామాలకు నెట్వర్క్ సదుపాయం కల్పించాలని గిరిజనులు కోరుతున్నారు.