కుమ్రం భీం ఆసిఫాబాద్, జనవరి 1 (నమస్తే తెలంగాణ) : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానను మందుల కొరత వేధిస్తున్నది. సర్కారు పట్టింపులేని తనంతో రోగులు బయటే కొనుక్కోవాల్సి వస్తున్నది. నిత్యం ఈ హాస్పిటల్‌కు 80 మంది వరకు ఔట్ పేషెంట్లు వస్తుంటారు. డాక్టర్లు పరీక్షించి మందులు రాస్తున్నారు. అందులో చాలా వరకు దవాఖానలో లభించకపోవడంతో బయటే కొన్కుకోవాల్సిన దుస్థితి నెలకొంది.
ఇదేమని సిబ్బందిని అడిగితే తమ దగ్గర ఉన్నవి మాత్రమే రోగులకు అందిస్తున్నామని చెబుతున్నారు. కేసీఆర్ సర్కారు సకల సౌకర్యాలు కల్పించడమేగాక అన్ని రకాల సేవలందించి పూర్తిస్థాయిలో మందులు ఇచ్చిందని, ప్రస్తుత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అవస్థలు పడుతున్నామని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈయన పేరు రమేశ్. ఊరు ఆసిఫాబాద్. జ్వరం.. జలుబుతో బాధపడుతున్న తన మూడేళ్ల కొడుకు అజంను శనివారం స్థానిక ప్రభుత్వ దవాఖానకు తీసుకువచ్చాడు. డాక్టర్ పరీక్షించి మూడు రకాల సిరప్లు రాసిచ్చారు. మందులు ఇచ్చే కౌంటర్ వద్దకు వెళ్లి చీటీ చూపించగా, రెండు రకాల సిరప్లు ఇచ్చారు. మరో సిరప్ ఏదని అడిగితే బయట కొనుక్కోవాలని చీటీపై రెడ్‌మార్క్ చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో రమేశ్ సిరప్‌ను బయట కొనుగోలు చేశాడు.
ఆసిఫాబాద్‌కు చెందిన శ్రీను సాధారణ జ్వరంతో దవాఖానకు వచ్చాడు. డాక్టర్ పరీక్షించి మూడు రకాల గోలీలు రాశాడు. కౌంటర్లో రెండు రకాల మందులు మాత్రమే ఇచ్చారు. మరొకటి బయట కొనుక్కోవాలని సిబ్బంది చెప్పారు. దీంతో చేసేదేమిలేక బయట కొనుక్కొని వెళ్లిపోయాడు.