మంచిర్యాల జిల్లా హజీపూర్ మండలం పడ్తనపల్లి పీఏసీఎస్‌లో మొత్తం 1972 మంది రైతులుండగా, ఇందులో 417 మంది రుణాలు తీసుకున్నారు. వీరిలో 276 మంది అర్హులు కాగా, సొసైటీ మొత్తంగా ఒకే ఒక్కరికే రుణమాఫీ జరిగింది. ఈ సొసైటీలో రూ. 2 లక్షలలోపు తీసుకున్న రుణం మొత్తం రూ.1.80 కోట్లు ఉండగా, కేవలం రూ.50 వేలే మాఫీ అయ్యింది.
చెన్నూర్ పీఏసీఎస్ సొసైటీలో 635 మంది రైతులుంటే రూ.2 లక్షల లోపు రుణం తీసుకున్నవాళ్లు 626 మంది ఉన్నారు. వీరిలో రుణమాఫీ అయినోళ్లు కేవలం 197 మందే. రూ. 2 లక్షల లోపు రుణాలు రూ.4.64 కోట్లు ఉండగా, కేవలం రూ.కోటి మాత్రమే మాఫీ అయ్యింది.
మంచిర్యాల, జనవరి 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఇలా పడ్తనపల్లి, చెన్నూర్ పీఏసీఎస్ సొసైటీల్లోనే కాదు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అన్ని సహకార సంఘాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మొత్తం సహకార సంఘాల్లో రూ. 2 లక్షల లోపు రుణాలు తీసుకున్న రైతులు 56 వేల మంది ఉన్నారు. వీరంతా రూ.498 కోట్ల రుణం తీసుకోగా, ఈ మొత్తం మాఫీ చేయాలని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. కానీ, కాంగ్రెస్ సర్కారు అన్ని విడుతల్లో కలిపి 26 వేల మంది రైతులకు రూ.185 కోట్లు మాత్రమే రుణమాఫీ చేసింది. మరో 30 వేల మంది రైతులకు రూ.313 కోట్ల మాఫీ కాలేదు. మొత్తంగా చూసుకుంటే సహకార సంఘాల్లో రుణమాఫీ జరిగిన రైతులు 36 శాతం మాత్రమే ఉన్నారు. ఇది ఒక ఆదిలాబాద్ జిల్లాలోనే కాదు దాదాపు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని సహకార సంఘాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని తెలుస్తున్నది. రూ. 2 లక్షల లోపు రుణం ఉన్న రైతులందరికీ మాఫీ చేశామంటూ గొప్పలు చెప్పుకుంటున్న.. అధికార పార్టీ నాయకులు సహకార సంఘాల్లో రుణమాఫీ కాని రైతుల విషయం బయటికి పొక్కకుండా తొక్కిపెడుతున్నారనే ఆరోపణలున్నాయి.
రూ. కోట్లలో అవినీతి..!
సహకార సంఘాల్లో రుణాల మాటున కోట్లాది రూపాయల అవినీతి జరిగిందని రైతులు ఆరోపిస్తున్నారు. బ్యాంక్‌లో రూ. 2 లక్షల లోన్ తీసుకుంటే దానిపై వడ్డీ ఎంతైతే అంత కలిపి తిరిగి చెల్లించాలి. కానీ, సహకార సంఘాల్లో షేర్ అమౌంట్ ముందే కట్ చేసుకుంటారు. ఉదాహరణకు ఒక రైతు రూ.2 లక్షల లోన్ తీసుకుంటే.. రూ.20 వేలు సొసైటీ కట్ చేసుకొని రూ.1.80 లక్షలు మాత్రమే రైతుకు ఇస్తారు. కానీ, వడ్డీ రూ. 2 లక్షలకు వేస్తారు. ఇలా ఒక్కో రైతుపై కట్ చేసుకున్న మొత్తం కోట్లలో ఉంటుంది. అయితే, ఆ డబ్బులు ఏం చేస్తున్నారు. దానిపై వచ్చిన లాభం ఎంత, దాని గుడ్‌విల్ ఎంత.. ఈ లెక్కలేవీ చెప్పడం లేదు. ఆ వివరాలన్నీ బయటకు తీస్తే సొసైటీల్లో రూ. కోట్లలో అవినీతి బయట పడే అవకాశాలున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు.
కాంగ్రెస్ సర్కారు గడిచిన నాలుగు విడుతలుగా చేస్తున్న రుణమాఫీలో కొన్ని సొసైటీల్లో రైతులకు తెలియకుండా వారి పేర్లపై లోన్లు తీసిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. అందుకే సహకార సంఘాల్లో లోన్ తీసుకున్న రైతులకు అసలు రుణమాఫీ కావడం లేదని అన్నదాతలు ఆరోపిస్తున్నారు. ఒకే రేషన్ కార్డు ఉందని, ఇంట్లో ఒక్కరికేనని, ఐటీ కడుతున్నారని ఇప్పటికే చాలా మంది రైతులను రుణమాఫీ నుంచి తప్పించిన అధికారులు కనీసం రూ.2 లక్షల లోపు రుణం ఉండి.. అర్హులైన వారికైనా మాఫీ చేయాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. అన్ని జిల్లాల సొసైటీల్లో అక్రమాలపై దర్యాప్తు చేసి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని, నష్టపోయిన రైతులకు ఇప్పటికైనా న్యాయం చేయాలని విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. మరి ఇప్పటికైనా అధికారులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకొని సహకార సంఘాల్లో రుణమాఫీ కాని రైతులకు న్యాయం చేస్తారో లేదో చూడాలి మరి.
ఆడిట్ చేస్తున్నాం.. పండుగయ్యాక మాఫీ అవుతుంది
ఆన్లైన్లో ఆడిట్ సమస్య ఉందని చూపిస్తున్న రైతులందరికీ పండుగ అయ్యాక మాఫీ డబ్బులు ఖాతాల్లో పడుతాయి. పడ్తనపల్లిలో మొన్ననే మా ఇద్దరు అధికారులు వెళ్లి ఆడిట్ చేసి వచ్చారు. మిగిలిన సొసైటీల్లో ఆడిట్ చేస్తున్నారు. రైతులెవరూ కంగారు పడాల్సిన పని లేదు. రూ. 2 లక్షల లోపు రుణం ఉండి, అర్హులైన వారందరికీ మాఫీ అవుతుంది. సొసైటీల్లో వాటాధనం కట్టని వారి నుంచి కొంత మొత్తం కట్ చేసుకుంటారు. తిరిగి చెల్లించేటప్పుడు అది కట్ చేసే చెల్లించుకుంటారు. కొందరు రైతులు దీనిపై అవగాహన పెంచుకోవాలి. నిజంగా అలాంటివి ఎక్కడైనా ఉంటే మాకు చెప్పండి. కచ్చితంగా చర్యలు తీసుకుంటాం.
– సంజీవ్‌రెడ్డి, డీసీవో మంచిర్యాల
సంక్రాంతి వచ్చినా మాఫీ కాలే
పడ్తనపల్లి సొసైటీలో నేను, మా అన్న తలా రూ.30 వేల చొప్పున లోన్ తీసుకున్నం. వడ్డీ కలిపితే మొత్తం రూ.40 వేల లోపే ఉంటది. మా ఇద్దరి రేషన్‌కార్డులు కూడా వేర్వేరుగా ఉన్నాయి. కానీ మాకు రుణమాఫీ కాలేదు. కేసీఆర్ సర్కారులో మాఫీ అయినయి. ఇప్పుడు ఎందుకు కాలేదో తెలియడం లేదు. అధికారులను అడిగితే అప్పుడైతది.. ఇప్పుడైతదని చెప్పుకొచ్చిన్రు. చివరకు జనవరిలో అవుతుందన్నారు. జనవరి వచ్చి సంక్రాంతి పండుగ పోతున్నా ఇప్పటికీ కాకపాయె. మాకు న్యాయం చేయాలి.
– గోళ్ల భూమేశ్, రైతు పడ్తనపల్లి
సొసైటీలో ఎవ్వరికీ కాలేదు
మా నాన్న పేరుపై పడ్తనపల్లి సొసైటీలో రూ.లక్ష లోన్ ఉన్నది. నా పేరుతో వేరే బ్యాంక్‌లో రూ. లక్ష దాకా ఉన్నది. ఇద్దరి రేషన్‌కార్డు ఒక్కటే. లెక్క ప్రకారం ఇద్దరిలో ఒక్కరికన్నా కావాలి. కానీ, ఇద్దరిలో ఏ ఒక్కరికీ మాఫీ కాలేదు. ఆన్లైన్లో ఏదో ఆడిట్ చేయాల్సి ఉందని చూపిస్తున్నది. మా పడ్తనపల్లి సొసైటీ పరిధిలోని హాజీపూర్, దొనబండ, టీకానపల్లి, బలవార్పేట, పెద్దంపేట, పడ్తనపల్లి గ్రామాల రైతులందరూ ఉన్నారు. దాదాపు రెండు వేల మంది రైతులుంటే కేవలం ఒక్కరికే రుణమాఫీ అయ్యింది. మా సొసైటీలో ఇట్లా ఎందుకైందో అర్థమైతలేదు.
– కొత్తకొండ నాగరాజు