ఆదిలాబాద్, జూలై 13(నమస్తే తెలంగాణ) ః ఆదిలాబాద్ జిల్లాలో చేపట్టనున్న ఇండస్ట్రియల్ కారిడార్ నుంచి తమ భూములను మినహాయించాలని ప్రభుత్వాన్ని రైతులు కోరారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలంలోని గూడ, కొరాట, హత్తిఘాట్ గ్రామాలకు చెందిన రైతులు ప్రజావాణిలో కలెక్టర్ రాజర్షి షాను కలిసి వినతిపత్రం అందించారు. ఇండస్ట్రియల్ కారిడార్ కోసం అధికారులు సర్వే నిర్వహిస్తున్నారని, దీంతో తాము ఆందోళనకు గురవుతున్నామన్నారు. నాలుగు గ్రామాల్లోని 2064 ఎకరాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందని, తాతలకాలం నుంచి వ్యవసాయామే జీవనాధారంగా బతుకుతున్న వందలాది కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందన్నారు.
భూములపై ఆధారపడి జీవిస్తున్నామని, కారిడార్ ఏర్పాటుతో తమ పిల్లల భవిష్యత్ ఏమవుతుందో తెలియడం లేదని, రైతుల చేతిలో భూమి లేకపోతే మా జీవితాలు అంధకారంగా మారుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాహితం పేరిట ప్రభుత్వం భూములను తప్పనిసరిగా స్వాధీనం చేసుకోవాలని నిర్ణయిస్తే తమ జీవితాలను దృష్టిలో పెట్టుకొని తాము సూచించిన డిమాండ్లు నెరవేర్చాలని, అప్పటి వరకు భూ సేకరణ జరపవద్దని సూచించారు.
రైతుల డిమాండ్లు
ఎకరాకు రూ.69 లక్షల నుంచి రూ.70 లక్షల పరిహారం ఇవ్వాలి. లేని పక్షంలో ప్రభుత్వం ఎంత భూమిని తీసుకుంటుందో అంతే విస్తీర్ణంలో ప్రత్యామ్యాయ సాగు భూమిని ఇవ్వాలి. భూమిని కోల్పోయిన రైతు కుటుంబాలకు శాశ్వత ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. ప్రతి కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇళ్లతోపాటు జీవనోపాధి కోల్పోయిన వ్యవసాయ కూలీలకు రూ.5 లక్షల పరిహారం చెల్లించాలి. తాము సూచించిన డిమాండ్లను ఒప్పుకొని ప్రభుత్వం లిఖిత పూర్వకంగా ఒప్పందం కుదుర్చుకున్న తర్వాతనే ఇండస్ట్రియల్ కారిడార్ పనులు ప్రారంభించాలి.
భూములు లాక్కోవద్దు..
రైతులు తమ భూములు అమ్ముకోకుండా సా గు చేస్తూ కుటుంబాలను పోషించుకుంటారని, ప్రభుత్వం బలవంతంగా భూములు లాక్కోని తన కన్నీళ్లపై అభివృద్ధిని నిర్మించవద్దని రైతులు కోరారు. భూములు లేకపోతే రైతులు అనాథలుగా మా రుతారు. రైతుల జీవితాలను అన్యాయం చేయవద్దని కోరారు. చనాక, కొరాట ప్రాజెక్టు కాలువల ద్వారా రెండు పంటలు సాగు చేసే అవకాశం ఉం దని, ఈ సమయంలో విలువైన తమ భూముల ను సేకరించడం సరికాదని రైతులు తెలిపారు. ప్ర జావాణికి వచ్చిన రైతులతో మాట్లాడిన కలెక్టర్ భూములు కోల్పోతున్న రైతులతో సమావేశంలో ఏర్పాటు చేసి ధర నిర్ణయిస్తామని సూచించారు.
ధర నిర్ణయించిన తర్వాత భూ సేకరణ జరుపాలి
ప్రభుత్వం ఇండస్ట్రియల్ కారిడార్ కోసం భూ సేకరణ ప్రక్రియ ప్రారంభించినప్పటి నుంచి రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. చనాక, కొరాట ప్రాజెక్టు ద్వారా రెండు పంటలు సాగు చేసే అవకాశం ఉన్న సమయంలో ప్రభుత్వం భూములు తీసుకుంటే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. సాగునీటి సౌకర్యం ఉన్న భూములు ఎక్కడ దొరకవు. రెవెన్యూ అధికారులు ఎకరాకు రూ. 12 లక్షలు ఇస్తామని అంటున్నారు. ఈ ధరకు భూమిని ఇచ్చే ప్రసక్తి లేదు. అధికారులు ముందుగా ధర నిర్ణయించిన తర్వాత భూ సేకరణ చేపట్టాలి. ప్రభుత్వం రైతుల సూచనలను పక్కన పెట్టి బలవంతంగా భూములు తీసుకునే ప్రయత్నాలు మానుకోవాలి.
– కలమరుగుల సంతోష్, రైతు, కొరాట, భోరజ్ మండలం
రైతులను రోడ్డుపాలు చేయవద్దు..
ప్రభుత్వం పరిశ్రమలను నెలకొల్పడానికి రైతుల పచ్చని భూములను లాక్కొని రోడ్డుపాలు చేయవద్దు. ఇండస్ట్రియల్ కారిడార్ నుంచి సాగు భూములను మినహాయించి నష్టపోకుండా చర్యలు తీసుకోవాలి. వందలాది మంది రైతులు తాతల కాలం నుంచి భూములను సాగు చేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. నాకు ఎనిమిది ఎకరాల భూమి ఉండగా మొత్తం పోతుందని అంటున్నారు. వ్యవసాయం జీవనాధారంగా ఉన్న రైతు సాగుభూమి లేకుండా పోతే ఎలా బతుకాలి. రైతులకు వ్యవసాయం తప్ప వేరే పనులు తెలియవు. పరిశ్రమల పేరిట రైతులకు అన్యాయం చేయవద్దు. రైతులు సూచించిన ధరతో పాటు ఇతర డిమాండ్లు పరిష్కరించి తర్వాతనే భూ సేకరణ చేపట్టాలి.
– చిరంజీవి, రైతు, కొరాట, భోరజ్ మండలం