హాజీపూర్, జనవరి 20 : ‘మా గ్రామ పంచాయతే మాకు మద్దు.. కార్పొరేషన్లో కలపడం వద్దే వద్దు..’ అంటూ మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం నర్సింగాపూర్ గ్రామస్తులు ఆందోళన బాట పట్టారు. ఇటీవల మంచిర్యాల మున్సిపాలిటీని కార్పొరేషన్ చేస్తూ నర్సింగాపూర్ గ్రామాన్ని విలీనం చేయడాన్ని నిరసిస్తూ గ్రామస్తులు స్థానిక రహదారి-63 వద్దకు రాస్తారోకో చేసేందుకు వచ్చారు. అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు రాస్తారోకో, ధర్నాను అడ్డుకునే ప్రయత్నం చేశారు. మంచిర్యాల ఏసీపీ ప్రకాశ్, హాజీపూర్ తహశీల్దార్ శ్రీనివాస్ రావ్ దేశ్పాండే గ్రామస్తులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు.
గ్రామస్తులు ససేమిరా అంటూ రాస్తారోకో, ధర్నాకు దిగుతుండగా.. కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తామని హెచ్చరించారు. దీంతో వారు జాతీయ రహదారిపైకి రాకుండా రోడ్డు పక్కన ధర్నాకు దిగారు. టెంట్, వంట సామగ్రిని తెప్పించుకొని న్యాయం జరిగే వరకూ ఇక్కడే ఉంటామని భీష్మించుకుకూర్చున్నారు. కలెక్టర్ రావాలి.. న్యాయం.. చేయాలంటూ నినాదాలు చేస్తూ మూడు గంటల పాటు ఆందోళన చేపట్టారు.
తహశీల్దార్, ఏసీపీలు కలగజేసుకొని సమస్య కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళనను విరమించారు. గ్రామస్తులు మాట్లాడుతూ నర్సింగాపూర్లో 2500 జనాభా ఉండగా, అందులో 1300 మంది ఓటర్లున్నారని, ఇందులో 70 శాతం మంది రైతులు, కూలీలు వ్యవసాయంపైనే ఆధారపడి బతుకుతున్నారని, ఉపాధి హామీ పథకంలో ఏడాది పాటు వంద రోజుల పని దొరుకుతుందని తెలిపారు.
కార్పొరేషన్లో విలీనం చేయడం వల్ల ఉపాధి కోల్పోయి పస్తులండాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలోని ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు దీన్ని ఖండించక పోవడంపై గ్రామస్తులు మండి పడుతున్నారు. నాయకులు అమ్ముడు పోయారని దుమ్మెత్తిపోస్తున్నారు. రెండు రోజుల్లో న్యాయం చేయక పోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.