మంచిర్యాల, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అధికార గర్వంతో కాంగ్రెస్ పార్టీ జిల్లాలోని మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాలు పెట్టిన సంగతి తెలిసిందే. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ అనంతరం కౌన్సిలర్లను క్యాంప్‌లకు తరలించారు. ఈ క్రమంలో మంచిర్యాల మున్సిపాలిటీ కౌన్సిలర్లు దాదాపు 20 మంది కుటుంబాలతో సహా గోవాకు వెళ్లారు. కొన్ని రోజులుగా అక్కడే ఎంజాయ్ చేస్తున్నారు. శుక్రవారం మంచిర్యాల వచ్చి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకోనున్నారు. నస్పూర్ మున్సిపల్ కౌన్సిలర్లు విజయవాడకు, క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ కౌన్సిలర్లు తీర్థయాత్రలకు వెళ్లి తిరిగి వచ్చారు.
ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. గెలిపించిన ప్రజలు మాత్రం కౌన్సిలర్లపై మండిపడుతున్నారు. మా ఓట్లతో గెలిచి లక్షల రూపాయలకు అమ్ముడు పోయారని, అధికార దాహంతో ఆగలేక వేరే పార్టీలోకి మారారని మండిపడుతున్నారు. నెలల తరబడి వార్డుల్లో పేరుకుపోయిన సమస్యలను గాలికివదిలేసి టూర్లకు పోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని వార్డుల్లో నెలల తరబడి పేరుకుపోయిన సమస్యలపై ‘నమస్తే తెలంగాణ’ దృశ్యమాలిక.