బాసర, మే 2 : బాసర పుణ్యక్షేత్రంలో గోదావరి వద్ద బాసర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రతి బుధవారం గోదావరి నిత్యహారతి కార్యక్రమం నిర్వహించే వారు. ఇంతకు ముందు నుంచి ప్రతి రోజూ బాసరలోని వేద పాఠశాల ఆధ్వర్యంలో గోదావరి నిత్యహారతి కార్యక్రమం నిర్వహించేవారు. ఈ ఘాట్ వద్ద కొన్ని రోజులుగా వివాదాలు కొనసాగుతుండడంతో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిలిపివేశారు. అయినా వేద పాఠశాల నుంచి కమిటీలు ఏర్పాటు చేసి నిత్యహారతిని నిర్వహించాలని నిర్ణయించారు.
దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ప్రతి బుధవారం నిర్వహించే హారతి కార్యక్రమంలో భాగంగా గత బుధవారం(ఏప్రిల్ 30)న ఆలయ అర్చకులు అక్కడ హారతి కార్యక్రమం నిర్వహించారు. వేద పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించే ఘాట్ వద్దనే నిర్వహించారు. దీంతో వేద పాఠశాల ఆలయ కమిటీ సభ్యులు శుక్రవారం ఇక్కడ ఎవరికీ ఆస్కారం లేకుండా తామే ట్రస్ట్ తరఫున నిర్వహిస్తున్నట్లు తెలిపి గోదావరి హారతి కార్యక్రమం నిర్వహించారు.
వేద విద్యానంద గిరి స్వామి వేద భారతి పీఠం అభివృద్ధికి ట్రస్టును ఏర్పాటు చేసి వేద పాఠశాల, గోశాల, నిత్య గంగా హారతి నిర్వహిస్తున్నట్లు వేద భారతి పీఠం పండితులు తెలిపారు. లోక కల్యాణం కోసం వేద పీఠాన్ని ప్రారంభించి హైందవ ధర్మ పరిరక్షణకు వేద విద్యానంద గిరి స్వామి ఆధ్వర్యంలో కృషి చేస్తున్నట్లు తెలిపారు.