Nirmal : నర్సాపూర్ (జి): నిర్మల్ జిల్లా నర్సాపూర్ (జి) లో శుక్రవారం చోటుచేసుకుంది. వేసవిలో ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందేందుకు ఈతకు వెళ్లిన ఇద్దరు యువకుల జీవితం విషాదంగా ముగిసింది. స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన యంఎ. రిజ్వాన్ ఉద్దిన్ (20), అబ్దుల్ అర్షద్(22)లు ఎస్సారెస్పీ సుద్దవాగులో మునిగి మృతి చెందారు.
స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు… నర్సాపూర్ (జి) మండల కేంద్రానికి చెందిన యంఎ. రిజ్వాన్ ఉద్దిన్ (20), అబ్దుల్ అర్షద్(22) స్నేహితులతో కలిసి శుక్రవారం నర్సాపూర్ (జి) గ్రామ శివారులోని ఎస్సారెస్పీ సుద్దవాగులో ఈత కొట్టేందుకు వెళ్లారు. అయితే.. వాగులో నీటి లోతు అంచనా వేయలేక ఇద్దరూ నీట మునిగారు. ఉద్దిన్, అర్షద్ నీళ్లలో మునిగిపోవడంతో స్నేహితులు భయంతో పోలీసులకు సమాచారమిచ్చారు.
గజ ఈతగాళ్లు వాగులో గాలించగా అప్పటికే అబ్దుల్ అర్షద్ మృతి చెందాడు. యంఎ. రిజ్వాన్ ఉద్దిన్ కొన ఊపిరితో ఉండగా 108 అంబులెన్స్‌లో నిర్మల్ ఆసుపత్రికి తరలించారు. అతడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. చేతికి అందివచ్చిన కుమారులు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గణేష్ తెలిపారు.