నిర్మల్ : పాఠశాలల్లోని విద్యార్థులందరికి మంచి రుచికరమైన భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారుఖీ జిల్లాలోని అన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులకు సూచించారు. బుధవారం నర్సాపూర్(జి) మండలంలోని పలు పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలన్నారు.
ప్రధానోపాధ్యాయులు గ్రామపంచాయతీ సహకారంతో పరిసరాలను శానిటైజేషన్ చేయించాలన్నారు. అలాగే ఎక్కడ నీరు నిలవకుండా చూడాలని, దోమలను పెరుగకుండా కిరోసిన్ లేదా బైటెక్స్ స్ప్రే చేయించాలని ఆదేశించారు. వంట గదులను పరిశీలించి, వంట చేసే ఆవరణ మొత్తం శుభ్రంగా ఉంచుకోవాలన్నారు.
వంట సిబ్బంది కూడా శుభ్రతను పాటించాలన్నారు. విద్యార్థుల తరగతి గదులను పరిశీలించి, విద్యార్థులు కూడా పరిశుభ్రతను పాటించాలని, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, జిల్లా విద్యాశాఖాఅధికారి డా. ఏ. రవీందర్ రెడ్డి ఎంపీఓ శ్రీనివాస్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.