నిర్మల్ అర్బన్, డిసెంబర్ 23 : శాంతి భద్రతల పరిరక్షణలో హోంగార్డులు కీలక పాత్ర పోషిస్తున్నారు. పోలీసులతో పాటు సమాన విధులు నిర్వహిస్తూ ఆపద సమయంలో ప్రజల భద్రతకు మేమున్నామంటూ ముందుకు వస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చాలీచాలని వేతనంతో ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన హోంగార్డులకు.. తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటున్నది. ప్రస్తుతం 30 శాతం వేతనాలను పెంచింది. దీంతో హోంగార్డులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పోలీసులతో సమానంగా విధులు..
శాంతి భద్రల విషయంలో పోలీస్‌శాఖ సిబ్బందితో సమానంగా హోంగార్డులు విధులు నిర్వర్తిస్తున్నారు. పెట్రోలింగ్‌తో పాటు కార్డర్సెర్చ్, ఎలక్షన్ డ్యూటీలు, ట్రాఫిక్ విధులు, చలానాల నమోదు, కళాజాత, ట్రాఫిక్ రూల్స్‌పై విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహించడం వంటివి అనేక రంగాల్లో హోంగార్డులు పోలీస్ శాఖ సిబ్బందితో సమానంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీరు హోంగార్డులు, పోలీసులు అన్న బేధాభిప్రాయాలు లేకుండా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు
హోంగార్డులకు మొదట నెలకు రూ.2400 ఉండేది. కొన్ని సంవత్సరాల తర్వాత రూ.6వేలు, తెలంగాణ రాష్ట్రంలో రూ.12వేలకు వేతనాలు పెరిగాయి. ఆ తర్వాత వీరి సేవలను గుర్తించిన సీఎం కేసీఆర్ రూ.24 వేలకు పెంచింది. ప్రతియేటా నాలుగు సంవత్సరాలుగా రూ.వెయ్యి చొప్పున పెంచగా, ఈసారి 30 శాతం పెంచింది. దీంతో వారికి ప్రస్తుత వేతనాలతో కలిపి పెరిగిన వేతనం ఒక్కొక్కరికి రూ.30,300 వరకు రానుంది.
జిల్లాలో 262 మంది విధులు..
నిర్మల్ జిల్లాలోని 19 మండలాల్లోని ఆయా పోలీస్ స్టేషన్లలో హోంగార్డులు విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రతి స్టేషన్లలో దాదాపు 10 మంది చొప్పున మొత్తం 262 మంది ఉన్నారు. ఇందులో ట్రాఫిక్ విభాగం, బ్లూకోల్ట్స్, పెట్రోకార్స్, డయల్ 100, ఎస్కార్ట్ డ్రైవర్స్ ఇలా.. వివిధ రంగాల్లో శాంతి భద్రతల పరిరక్షణకు హోంగార్డులు పాటు పడుతున్నారు. పెరిగిన వేతనాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో కలిసి సగటున వెయ్యి మందికి లబ్ధి చేరనుంది.
ప్రభుత్వానికి రుణపడి ఉంటాం..
చాలీచాలని వేతనాలతో మేము కొన్నేండ్లుగా విధులు నిర్వహిస్తున్నాం. సీఎం కేసీఆర్ మా కష్టాలను చూసి వేతనాలను దశల వారీగా పెంచారు. రూ.12 వేల వేతనం నుంచి ఏకంగా రూ.24 వేలకు పెంచారు. ప్రస్తుతం 30 శాతం వేతనాలను పెంచడం చాలా సంతోషంగా ఉంది. హోంగార్డులమంతా ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.