కుంటాల : తన మొదటి నెల జీతాన్ని అమరుడి కుటుంబానికి అందజేసి ఓ ప్రభుత్వ ఉద్యోగి తన మానవత్వాన్ని చాటుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే..కుంటాల మండల కేంద్రానికి చెందిన చేపూరి వినయ్ బాబు ఇటీవల వెలువడిన గ్రూప్ 4 ఫలితాల్లో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాడు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రాణ త్యాగం చేసిన నిర్మల్ మండలంలోని కొండాపూర్‌కు చెందిన భాస్కరాచారి కుటుంబానికి తన మొదటి జీతం నుంచి రూ.10,000 బాధిత కుటుంబానికి అందజేశాడు.
భాస్కరాచారి 2009 డిసెంబర్ 3 న భైంసాలోని గడ్డెన్న వాగులో దూకి స్వరాష్ట్ర కోసం ప్రాణాలు అర్పించాడు.
ఇదే సమయంలో ఉద్యమ నాయకుడు కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేశాడన్నారు. తాను పోటీ పరీక్షల కోసం తెలంగాణ చరిత్ర చదివేటప్పుడు ఈ విషయాలు గుర్తు చేసుకొని చలించిపోయానని వినయ్ పేర్కొన్నారు. వారి స్ఫూర్తితో ఆ కుటుంబానికి నా వంతు సాయం అందించానని తెలిపాడు. వినయ్ బాబు ప్రస్తుతం నిర్మల్ జిల్లా కలెక్టరేట్లో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు.