కుభీర్, ఆగస్టు 10: మండలంలోని చాత గ్రామంలోని అగ్నిప్రమాద బాధితురాలికి వ్యాపారవేత్త బోస్లే మోహన్రావు పటేల్ (Mohan Rao Patel) అండగా నిలిచారు. ప్రభుత్వం ఆదుకోకపోయినా తన వంతు సాయంగా రేకులు ఇల్లు నిర్మించి ఇస్తానని మాటిచ్చారు మోహన్రావు. జూలై నెలలో షార్ట్ సర్క్యూట్ (Short Circuit) కారణంగా పూజారి శాంతాబాయి(Shantabai) అనే వ్యవసాయ కూలీ ఇల్లు కాలి బూడిదైంది. ప్రమాదం జరిగిన సమయంలో శాంతాబాయి బైంసా పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలోచికిత్స తీసుకుంటోంది. దాంతో, ఇరుగు పొరుగువారు అగ్నిమాపకు శాఖకు సమాచారం అందించడంతో వారు మంటల అర్పినప్పటికీ ఆమె ఇంటిలోని అన్ని వస్తువులు, సామగ్రి కాలిపోయాయి.
షార్ట్ సర్క్యూట్ ప్రమాదం ఫలితంగా శాంతాబాయి కుటుంబం వీధిపాలైంది. అప్పటినుంచి సాయం కోసం ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగింది శాంతాబాయి కుటుంబం. కానీ, ఆ పేద కుటుంబానికి ఎలాంటి ఆర్థిక సాయంగానీ, భరోసాగానీ లభించలేదు. సామాజిక మాధ్యమాల్లో శాంతాబాయి ఇంటి ప్రమాదానికి సంబంధించిన వీడియోలు చూసిన భైంసా పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త బోస్లే మోహన్ రావు పటేల్ స్పందించారు. ఆదివారం చాంత గ్రామానికి చేరుకున్న ఆయన శాంతాబాయిని పరామర్శించారు. తన ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు, కొంత నగదును అందించారు. అంతేకాదు వారం రోజులు తిరగకముందే రేకులతో కట్టిన ఇళ్లును నిర్మించి ఇస్తానని మోహన్రావు పటేల్ హామీ ఇచ్చారు.
ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవడంతో వీధినపడ్డ శాంతాబాయి కుటుంబానికి ఇల్లు కట్టించేందుకు ముందుకు వచ్చిన ఆయనను గ్రామస్థులు అభినందించారు. ఈ సందర్భంగా మోహన్రావు వెంట ముధోల్ మాజీ ఎంపీపీ సుభాష్ జాదవ్, జీపీడీసీ అభివృద్ధి కమిటీ ప్రధాన కార్యదర్శి పాపెన్ వార్ మనోజ్, రామకృష్ణ, కొత్తూరు శంకర్, గ్రామస్తులు ఉన్నారు.