కుభీర్, ఏప్రిల్ 08: అక్రమ మద్యం, ఆయుధాలు, పేలుడు పదార్థాలు, నమోదు కాని వస్తువులు, చట్ట విరుద్ధమైన పదార్థాలను వెలికి తీయడంతోపాటు అనుమానితులపై నిఘా, చట్ట వివిధ కార్యకలాపాలు నిరోధించడమే లక్ష్యంగా అన్ని గ్రామాలలో కర్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు బైంసా (Bhainsa) ఏఎస్పీ అవినాష్ కుమార్ సూచించారు. మంగళవారం తెల్లవారుజామున కుభీర్ మండలం చొండి గ్రామంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో గ్రామస్తులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. గుర్తుతెలియని వ్యక్తుల సంచారంపై నిఘా పెట్టాలన్నారు. ఆధారాలు లేకుండా ఇల్లు అద్దెకు ఇవ్వకూడదని పేర్కొన్నారు. గుర్తుతెలియని వ్యక్తులు తక్కువ ధరకు వాహనాలను అమ్మితే వాటిని కొనుక్కోవద్దని సూచించారు.
తల్లిదండ్రులు మైనర్ పిల్లలకు తమ వాహనాలను నడపకుండా జాగ్రత్త పడాలన్నారు. దీంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని సూచించారు. అనంతరం ఏప్రిల్ 14న బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. 57 ద్విచక్ర వాహనాలు, ఒక ఫోర్ వీలర్, ఐదు ఆటోలకు సంబంధించిన పత్రాలను తనిఖీ చేసి సరైన పత్రాలు లేని వాహనాలకు జరిమానా విధించారు. ఈ సందర్భంగా భైంసా రూరల్ సీఐ నైలు నాయక్, కుభీర్, కుంటాల, బైంసా రూరల్ ఎస్సైలు పీ. రవీందర్, అశోక్, శంకర్‌తో పాటు భైంసా సర్కిల్ పోలీస్ సిబ్బంది, మాజీ సర్పంచ్ చంద్రకాంత్, గ్రామస్తులు పాల్గొన్నారు.