దస్తురాబాద్: వినాయక చవితి సందర్భంగా గ్రామాల్లో ఏర్పాటు చేసిన గణేష్ మండపాల వద్ద విద్యుత్ ప్రమాదాలు జరగకుండా నిర్వాహకులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఖానాపూర్ విద్యుత్ శాఖ ఏడీఈ టీ. శ్రీనివాస్ సూచించారు. నిర్మల్ జిల్లా బుట్టాపూర్, చెన్నూర్ గ్రామాల్లోని గణేష్ మండపాలను సందర్శించిన ఆయన నిర్వాహకులు, భక్తులు, విద్యుత్ సిబ్బందికి విద్యుత్ భద్రతపై అవగాహన కల్పించారు.
మండపాల ఏర్పాటు, విద్యుత్ అలంకరణలు, లైటింగ్ సమయంలో విద్యుత్ వైర్లకు తగిన దూరం పాటించాలని సూచించారు.
నాణ్యమైన విద్యుత్ వైర్లు, ప్లగ్లు, స్విచ్లు వినియోగించాలని, ఎక్కడైనా దెబ్బతిన్న వైర్లు కనిపిస్తే వెంటనే మార్చాలని తెలిపారు. విద్యుత్ కనెక్షన్లను అనధికారికంగా తీసుకోకుండా నిపుణులైన సిబ్బందితోనే ఏర్పాటు చేయించుకోవాలని చెప్పారు. మండపాల వద్ద విద్యుత్ తీగలు నేలకు తగలకుండా, నీరు చేరే ప్రాంతాలకు దూరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యుత్ పరికరాలు తడవకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, తడి చేతులతో స్విచ్లు, విద్యుత్ పరికరాలను తాకరాదని భక్తులకు వివరించారు.
విద్యుత్ సంబంధిత సమస్యలు తలెత్తితే స్వయంగా మరమ్మతులు చేయకుండా వెంటనే విద్యుత్ శాఖ సిబ్బందికి సమాచారం అందించాలని కోరారు. గణేష్ మండపాల నిర్వాహకులు విద్యుత్ భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు, ప్రమాదాలు కలగకుండా చూడాలని ఏడీఈ శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమంలో బుట్టాపూర్ సర్పంచ్ జి. నరేష్, విద్యుత్ శాఖ సిబ్బంది, గణేష్ మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు.