చేప పిల్లల విడుదలకు కార్యాచరణ రూపొందించిన అధికారులు
గతేడాది కంటే పెరిగిన అంచనా
ఆన్లైన్ ద్వారా టెండర్ల ప్రక్రియ
ఈ నెల చివరి వారంలో చెరువుల్లోకి చేప పిల్లలు
అక్రమాలకు చెక్ పెట్టేందుకు జియోట్యాగింగ్
నిర్మల్ టౌన్/తాంసి, జూలై 5 : ఈ యేడాది నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో చేప పిల్లల విడుదలకు అధికారులు కార్యాచరణ రూపొందించారు. నిర్మల్‌లో 5 కోట్లు, ఆదిలాబాద్‌లో 1.32 కోట్లు విడుదల చేయాలని చూస్తున్నారు. రెండు జిల్లాల్లో గతేడాది కంటే 88 లక్షలు అదనంగా వేయనున్నారు. ఈ మేరకు ఆన్లైన్లో టెండర్లను కూడా ఆహ్వానించారు. ఈ నెల చివరి వారంలో చెరువులు, ప్రాజెక్టుల్లో చేప పిల్లలను విడువనున్నారు. కాగా.. చేప పిల్లల సరఫరాలో అక్రమాలు చోటు చేసుకుంటుండడంతో చెరువులకు జియోట్యాగింగ్ కూడా చేపట్టారు. ఈసారి ప్రధానంగా రవ్వు, బొచ్చ, బంగారుతీగ వంటి మేలు రకం వాటికి ప్రాధాన్యం ఇచ్చారు. నీలి విప్లవం వెల్లివిరుస్తుండడంతో మత్య్సకారుల కుటుంబాల్లో ఆనందం వ్యక్తమవుతున్నది.
మత్స్య కార్మికులను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం యేటా భారీ ఎత్తున చేపపిల్లలను అందిస్తున్నది. 2021-22 సంవత్సరానికిగాను నిర్మల్ జిల్లాలో 5 కోట్ల చేప పిల్లలను చెరువులు, ప్రాజెక్టులో పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గతేడాది జిల్లాలో 4.21కోట్ల చేప పిల్లలను విడుదల చేయగా.. ఈసారి 79 లక్షలను అదనంగా విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిర్మల్ జిల్లాలో మొత్తం 197 మత్స్య కార్మిక సంఘాలుండగా.. అందులో 28 మహిళా సంఘాలున్నాయి. జిల్లాలోని 673 చెరువులతో పాటు శ్రీరాంసాగర్, కడెం, సుద్దవాగు, పల్సిరంగారావు ప్రాజెక్టు, స్వర్ణ రిజర్వాయర్లలో చేప పిల్లలను వేయనున్నారు. వీటిద్వారా 12,500 మంది మత్స్య కార్మికులు , మరో 3 వేల మంది వ్యాపారం ద్వారా జీవనోపాధి పొందుతున్నారు. ఇప్పటికే చేపపిల్లల సరఫరాకు ప్రభుత్వం ఆన్లైన్ టెండర్ విధానం ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తోంది. జూన్, జూలై నెలల్లో కురిసిన వర్షాలకు చెరువులు, ప్రాజెక్టులు నిండుకోవడంతో ఈ నెల చివరి వారం నుంచి చేప పిల్లల విడుదలకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
ఆదిలాబాద్ జిల్లాలో ..
జిల్లాలోమొత్తం 225 చెరువలు ఉన్నాయి. సహకార సంఘాలు 45 ఉండగా, 4030మంది సభ్యులు ఉన్నారు. ఆయా చెరువుల్లో గతేడాది 1.23 చేప పిల్లలు వేయగా, ఈయేడాది 1.32 కోట్లు వదలనున్నారు.
జియోట్యాగింగ్ ద్వారా అక్రమాలకు బ్రేక్..
చేప పిల్లల సరఫరాలో అక్రమాలు చోటు చేసుకోవడం, లేని చెరువుల్లో పోసినట్లు చూపించడంతో ఈసారి జియోట్యాగింగ్ ద్వారా వాటికి చెక్‌పెట్టనున్నారు. ఇందుకోసం జిల్లాలో చెరువులను గ్రామాల వారీగా జియోట్యాగింగ్‌ను పూర్తి చేశారు. ప్రతి మండలంలో ఉన్న చెరువు, చెరువు పేరు, ఊరు, మండలం, విస్తీర్ణం, నీటి లభ్యత ఎన్ని రోజులు ఉంటుందో అంచనా వేసి ఆన్లైన్లో నమోదు చేశారు. ఏడాదిలో ఆరు నెలలు నీరు ఉన్న చెరువులకు మాత్రమే చేప పిల్లలను సబ్సిడీపై అందించాలని ప్రభుత్వం సూచించడంతో అందుకనుగుణంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. చేప పిల్లల్లో రవట, బొచ్చ, బంగారుతీగ వంటి మేలు రకం చేప పిల్లలను చెరువుల్లో విడుదల చేసేందుకు టెండర్లను పిలిచారు. గతంలో చెరువులకు చేప పిల్లలు సరఫరా అయితే శాంపిల్‌గా ఒకే డబ్బాను మాత్రమే లెక్కించి మిగతావి చెరువుల్లో వదిలేసేవారు. ఈసారి అలా కాకుండా చెరువుల నిర్వహణను చేపడుతున్న మత్స్య కార్మికులకు లెక్కించే బాధ్యతను అప్పగించారు. దీంతో వారు ధ్రువీకరణపత్రం ఇస్తేనే మత్స్యశాఖ డబ్బులు చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా మత్స్యశాఖ అధికారులు తెలిపారు.