సారంగాపూర్, ఆగస్టు 23 : ఆర్థిక స్థోమత లేక కనీసం పదో తరగతి పూర్తి చేయలేనివారు, చదువాలనే ఆసక్తి ఉన్నా ఇంట్లో పరిస్థితుల ప్రభావంతో ఇంటర్ చదువలేనివారు, పేదరికంలో మగ్గుతున్న గ్రామీణ ప్రాంతాల్లోని వారికి ఉన్నత చదువులు చదివే అవకాశం లేకపోవడం తో చాలా మంది పాఠశాలకు దూరంగా ఉన్నారు. వీరికోసమే ప్రభుత్వం ఓపెన్ స్కూల్(సార్వత్రిక) దూర వి ద్యా విధానాన్ని ప్రవేశపెట్టింది. గతేడాది కరోనా మూలం గా ప్రవేశాలను డిసెంబర్లో చేపట్టగా.. ఈసారి విద్యా సంవత్సరాన్ని సమయానికే ప్రారంభిస్తున్నారు. ఇందు లో భాగంగా ఈనెల 17వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. పది, ఇంటర్ తరగతులను రెగ్యులర్ మాదిరిగా సులభరీతిలో బోధించనున్నారు. ఎంపిక చేసి న మండలంలో బోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నా రు. అక్కడి పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి మండల సమన్వయకర్తగా బాధ్యతలు అప్పగిస్తున్నారు.అయితే సంవత్సరంలో 30 క్లాసులు ఉంటాయి. ఇందులో ప్రతి నెల రెండో శని, ఆదివారాల్లో మాత్రమే క్లాసులు ఉండనున్నాయి.
అందుబాటులో ఉన్న కోర్సులు
పదో తరగతిలో బోధన విషయాలను మూడు గ్రూపులుగా విభజించారు. గ్రూపు-ఏలో భాషలు, గ్రూపు-బీలో ప్రధాన పాఠ్యాంశాలు, గ్రూపు-సీలో వృత్తి విద్యాకోర్సులు ఉంటాయి. ఇంటర్లో గ్రూపు-ఏలో భాషలు, గ్రూపు-బీలో ఆప్షనల్స్, గ్రూపు-సీలో విద్యా కోర్సులు ఉంటాయి. పదిలో తెలుగు, హిందీ, ఇంగ్లిష్, ఉర్దూ మాధ్యమం, ఇంటర్లో తెలుగు, హిందీ, ఆంగ్లం, ఉర్దూ మాధ్యమాలు అందుబాటులో ఉన్నాయి. ఓపెన్ స్కూల్ విద్యను పూర్తి చేసిన వారు రెగ్యులర్ విద్యార్థులతో సమానంగా అన్ని కోర్సులు, ఉన్నత విద్య, ఉద్యోగాలు పొందడానికి అర్హులు. గతేడాది కరోనా మూలంగా పరీక్ష రాయకుండానే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పదిలో 4,181, ఇంటర్లో 2,991 మంది ఉత్తీర్ణత సాధించారు.
ఆన్లైన్లో నమోదు
ఓపెన్ స్కూల్లో చేరాలకునే వారు www. telanganaopen school.0rg వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో ఉత్తీర్ణులైన వారికి సార్వత్రిక విద్యాపీఠం ద్వారా ధ్రువీకరణ పత్రాలు అందజేస్తారు. వీటిని ఉన్నత విద్య, ఉద్యోగాలకు వినియోగించుకోవచ్చు. దరఖాస్తుదారులు సెప్టెంబర్ 10 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అపరాధ రుసుముతో సెప్టెంబర్ 23 వరకు ఉంది. పదో తరగతి చదివేందుకు విద్యార్హత లేదు. 14-50 ఏళ్ల వయస్సు ఉన్నవారంతా అర్హులే. వయస్సు నిర్ధారణకు తహసీల్దార్ లేదా మున్సిపల్ అధికారి జారీ చేసిన ధ్రువీకరణ పత్రం జతపరచాలి. మధ్యలో బడి మానేస్తే అప్పటి బదిలీ పత్రం, ఆధార్ కార్డు పత్రాలతో ప్రవేశాలు పొందవచ్చు.
ఇంటర్లో చేరాలంటే..
14-50 ఏళ్ల వయస్సు ఉన్నవారంతా అర్హులే. వారు పదో తరగతి బదిలీ పత్రం, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలతో ఇంటర్లో ప్రవేశం పొందవచ్చు. ఓపెన్ పదో తరగతిలో చేరే వారికి ఓసీలకు రూ.1100.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రూ.700. ఓపెన్ ఇంటర్మీడియట్లో చేరే వారికి ఓసీలకు రూ.1300.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రూ.1000. ఫీజు చెల్లిస్తే అడ్మిషన్లతోపాటు పాఠ్య పుస్తకాలను ప్రభుత్వం ఉచితంగా అందిస్తుంది.
ఉపాధికి ఉపయోగం..
సార్వత్రిక విద్యా విధానంలో చదివి చాలా మంది జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. ఓపెన్ స్కూల్లో పది, ఇంటర్లో ప్రవేశం పొందడానికి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. గ్రామీణ, పట్టణ ప్రాంత యువత ఉన్నత విద్య అభ్యసించేందుకు ఇది చక్కని అవకాశం.
– అశోక్‌కుమార్, ఉమ్మడి జిల్లా కో-ఆర్డినేటర్, ఆదిలాబాద్.