బాసర, నవంబర్ 22 : బాసర ట్రిపుల్ఐటీ అభివృద్ధి, విద్యార్థుల సంక్షేమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని నిర్మల్ ఎస్పీ జానకీ షర్మిల అన్నారు. శుక్రవారం ట్రిపుల్ఐటీలోని స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్లో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా ఆమె ట్రిపుల్ ఐటీని దత్తత తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆర్జీయూకేటీ అభివృద్ధి పథంలో సంపూర్ణ, సమగ్ర రక్షణ, విద్యార్థుల సంక్షేమానికి ఆర్జీయూకేటీని దత్తత తీసుకున్నామన్నారు.
విద్యార్థులకు వారి లక్ష్యాలను సాధించడంలో వారికి అవసరమైన మద్దతు, మార్గదర్శకత్వం అందించేందుకు కట్టుబడి ఉన్నానని తెలిపారు. విద్యార్థుల్లో బాధ్యత, సమాజ సేవా భావాన్ని పెంపొందించేందుకు అధ్యాపకులు కృషి చేయాలన్నారు. అనంతరం వీసీ గోవర్ధన్ మాట్లాడుతూ ట్రిపుల్ఐటీని ఎస్పీ దత్తత తీసుకోవడం వారి ఉదారమైన స్వభావానికి ధన్యవాదాలని, విద్యార్థులకు అందించిన సమయానికి కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఆరోగ్య సంరక్షణ, పాఠ్యేతర కార్యకలాపాలకు అందించడమే లక్ష్యంగా కలిసి పని చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ అవినాష్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రణధీర్ సాగి, అసోసియేట్ డీన్, స్టూడెంట్ వెల్ఫేర్ నాగరాజు, అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
నిర్మల్ అర్బన్, నవంబర్ 22 : జాతీయ దత్తత దినోత్సవం(నవంబర్ 23)ను పురస్కరించుకుని బాసర ట్రిపుల్ ఐటీ కళాశాలను దత్తత తీసుకుంటున్నట్లు నిర్మల్ జిల్లా ఎస్పీ జానకీ షర్మిల ప్రకటనలో తెలిపారు. బాసర ట్రిపుల్ ఐటీని ఆత్మహత్యలు లేని యూనివర్సిటీగా తీర్చిదిద్దాలని తెలిపారు. విద్యార్థుల లక్ష్యాలను నెరవేర్చుకునేలా జయకేతనం ఎగురవేద్దామని పిలుపునిచ్చారు. ఆత్మహత్యలు లేని యూనివర్సిటీగా తీర్చిదిద్దేందుకు జిల్లా పోలీసులు ఎల్లప్పుడూ ముందున్నారని తెలిపారు. విద్యార్థులకు ఏవైనా సమస్యలుంటే నేరుగా జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చి తెలుపవచ్చని సూచించారు.