నిర్మల్ అర్బన్, జూన్ 10 ః నిర్మల్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం అవినీతికి కేరాఫ్‌గా మారింది. ప్రతి పనికి ఓ రేటు కట్టి మరీ పైసలు వసూలు చేస్తున్నారు. కార్యాలయం చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగినా పని కావడం లేదు. దీంతో కొందరు పైసలు ఇస్తూ పనులు చేయించుకుంటుండగా.. మరీ కొందరు అవినీతి అధికారుల భరతం పడుతున్నారు.
అవినీతి నిరోదక శాఖ(ఏసీబీ)ను ఆశ్రయిస్తూ పట్టిస్తున్నారు. ఏసీబీ దాడుల్లో అత్యధికంగా మున్సిపల్ కార్యాలయం సిబ్బంది ఉండడం.. ఇందులో రెవెన్యూ శాఖలోనే పట్టుబడడం విమర్శలకు తావిస్తున్నది. కాగా.. ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు కావాల్సిన పనులు చేయాలి. ఇందుకోసం సర్కారు వారికి జీతాలు చెల్లిస్తున్నది. అవినీతికి అలవాటు పడిన అధికారులు లంచాల పేరిట సామాన్యులను వేధిస్తున్నారు. పైసలు ఇవ్వనిదే పని చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. సాధారణంగా పనిని బట్టి మూడు, ఐదు, ఏడు, 15 రోజుల్లో పనులు పూర్తి చేయాలి. కాగా.. అధికారులు లంచం అడిగితే 94404 46106 నంబర్‌కు సమాచారం అందించాలని ఏసీబీ డీఎస్పీ విజయ్‌కుమార్ తెలిపారు.
తాజాగా నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలోని రెవెన్యూ విభాగంపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. నూతనంగా ఇంటి నిర్మాణం చేస్తున్న యజమానికి ఇంటి నంబర్ జారీ చేయాల్సి ఉండగా.. అధికారులు లంచం అడిగారు. సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న ఇన్చార్జి ఆర్ఐ సంతోష్, ఔట్ సోర్సింగ్ విభాగంలో బిల్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న షోయబ్‌లు రూ.6 వేలు లంచం అడుగగా ఏసీబీని ఆశ్రయించి ఇద్దరిని పట్టించాడు.