నిర్మల్, జూన్ 1(నమస్తే తెలంగాణ) : ఎట్టకేలకు అన్నదాతపై కేంద్రం కనికరించింది. వచ్చే వానకాలం సీజన్ నుంచి రైతులు పండించే పంటలకు మద్దతు ధరను ప్రకటించింది. తాజాగా నిర్వహించిన కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీలో 2025-26 సంవత్సరానికి కనీస మద్దతు ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. దీంతో ఆరుతడి పంటలతోపాటు నూనె గింజలను సాగు చేసే రైతులకు అధిక ప్రయోజనం చేకూరనున్నది.
అత్యధికంగా నువ్వులు క్వింటాలుకు రూ.820, రాగులు రూ.596, పత్తి క్వింటాలుకు రూ.589 మేర మద్దతు ధర పెంచింది. అలాగే వరికి రూ.69, జొన్న పంటకు రూ.328, సజ్జలు రూ.150, మక్క రూ.175, కందులు రూ.450, పెసర రూ.86, మినుములు రూ.400, వేరుశనగ రూ.480, పొద్దు తిరుగుడు రూ. 441, సోయాబిన్ రూ.436, కుసుమలు రూ.579, అవిసలు క్వింటాలుకు రూ.820 చొప్పున పెంచుతున్నట్లు ప్రకటించింది. ఎప్పటి మాదిరిగానే ఈ సారి కూడా జిల్లా వ్యాప్తంగా 1.50 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని అధికారులు పేర్కొంటున్నారు. అయితే పత్తికి మద్దతు ధర పెంచడంతో ఈసారి సాగు విస్తీర్ణం పెరిగే అవకాశాలు ఉన్నాయి.
జిల్లాలో సాగు నీటి వనరులు పుష్కలంగా ఉండటం, బోరుబావులు అధికంగా ఉండడంతో వరి పెద్ద ఎత్తున సాగవుతుంది. యేటా యాసంగిలో 1.10 లక్షల ఎకరాలు, వానకాలంలో 1.35 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తారు. అయితే ఇంత పెద్ద ఎత్తున సాగయ్యే వరిపంటకు క్వింటాలుకు కేవలం రూ.69 మాత్రమే పెంచడంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. క్వింటాలుకు రూ.100 నుంచి 200 వరకు మద్దతు ధర పెంచితే బాగుండేదని రైతులు అభిప్రాయ పడుతున్నారు.