కడెం, ఆగస్టు 31 : సంపద వనాలను ఏర్పాటు చేసి వాటి ద్వారా పంచాయతీలకు ఆదాయం సమకూర్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అయా మండలాల్లో ఏర్పాటు చేయాలని భావించింది. నిర్మల్ జిల్లాకు మూడింటిని కేటాయించగా, స్థలం సమస్య కారణంగా కడెం మండల కేంద్రంలోనే రెండు, సోన్‌లో ఒకటి ఏర్పాటు చేశారు. కడెం, సారంగాపూర్ మండలాల్లోని స్వర్ణ, సోన్ మూడు మండలాలకు ఒక్కొక్కటి చొప్పున కేటాయించాలని భావించిన అధికారులు స్వర్ణలో స్థలం లేని కారణంగా కడెం మండల కేంద్రంలోనే ఏర్పాటు చేశారు. కడెం మండల కేంద్రంలోని నీటి పారుదల శాఖ కుడి కాలువకు ఇరువైపులా ఖాళీగా ఉన్న ఐదెకరాల నీటి పారుదల శాఖకు చెందిన స్థలంలోనే ఏర్పాటు చేశారు. ఒక్కొక్క దానికి రూ.9 లక్షలు ఖర్చు చేయగా.. వీటిని ఈజీఎస్ నిర్వహణతో ఏర్పాటు చేశారు. కూలీల ద్వారా ఇప్పటికే చుట్టూ కంచెల నిర్మాణం, జాలీలు పెట్టారు. ఇందులో పండ్లతోపాటు, పూల మొక్కలను నాటారు. పనులు వేగంగా పూర్తి చేయాలని ఆ బాధ్యతలను డీఆర్డీవోకు కలెక్టర్ అప్పగించడంతో నిత్యం పర్యవేక్షణ చేసి పూర్తి చేశారు.
మూడేళ్లపాటు నిర్వహణ
సంపద వనాల నిర్వహణను ఈజీఎస్ చూస్తుండగా 15-20 రోజులపాటు కూలీలకు పని కల్పించారు. ఒక్కో సంపద వనానికి రూ.9 లక్షల వరకు నిధులు వెచ్చించడంతో వీటిలో ఒక్కో వనంలో 3వేల-5వేల వరకు మొక్కలు పెంచే ఆస్కారముంది. ఇప్పటికే ఒక్కో దానిలో దాదాపు 3 వేలకు పైగా మొక్కలు నాటారు. పర్యవేక్షణకు వాచర్‌ను ఏర్పాటు చేశారు. మూడేళ్ల అనంతరం దీనిని స్థానిక గ్రామ పంచాయతీకి అప్పగిస్తారు. అనంతరం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఇక్కడి పండ్ల మొక్కల ద్వారా పండ్లను విక్రయించడంతోపాటు, వచ్చిన ఆదాయాన్ని గ్రామ పంచాయతీ అభివృద్ధికి వినియోగిస్తారు. పూలు, పండ్ల మొక్కలతోపాటు చిన్నారుల ఆట విడుపు కేంద్రాలను ఏర్పాటు చేసి వచ్చే ఆదాయాన్ని గ్రామాభివృద్ధికి ఉపయోగిస్తారు.
ఖాళీ స్థలం వినియోగంలోకి..
కడెం నీటి పారుదలశాఖకు చెందిన ఐదెకరాల ఖాళీ స్థలాన్ని అధికారులు వినియోగంలోకి తెచ్చారు. ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కాకుండా దాదాపు 3 వేలకు పైగా మొక్కలు నాటారు. కడెం జలాశయం కుడి కాలువ పక్కనే ఆనుకొని ఉండడంతో నీటి కొరత కూడా తీరే ఆస్కారం ఉంది. కడెంలో ఇప్పటికే నీటి పారుదలశాఖ కొన్ని భూములు అన్యాక్రాంతానికి గురయ్యాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఈ భూమి ప్రభుత్వం ఆధీనంలోనే ఉండనుంది. చుట్టూ కంచెల ఏర్పాటుతోపాటు, వివిధ రకాల మొక్కలతో సంపద వనాలు ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తున్నాయి.