నిర్మల్ టౌన్, అక్టోబర్ 10 : ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో అందరూ ఎన్నికల నియమావళి పాటించాలని, లేకపోతే చట్టప్రకారం చర్యలుంటాయని నిర్మల్ కలెక్టర్ వరుణ్‌రెడ్డి అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో మంగళశారం ఎస్పీ ప్రవీణ్‌కుమార్‌తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. జిల్లాలోని నిర్మల్, ఖానాపూర్, ముథోల్ నియోజకవర్గాలకు నవంబర్ 30న ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. ఇప్పటికే ఎన్నికల కమిషన్ అధికారికంగా షెడ్యుల్ ప్రకటించిందన్నారు.
అన్ని రాజకీయ పార్టీలు అనుమతి లేకుండా ర్యాలీలు, ఇతర సమావేశాలు నిర్వహించవద్దని సూచించారు. జిల్లాలో పోలీసుశాఖ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. రూ.50 వేలకు మించి తీసుకెళ్తే అందుకు సంబంధించిన వివరాలను చూపించాల్సి ఉంటుందని తెలిపారు. నిర్మల్ జిల్లాలో మొత్తం 906 పోలింగ్ కేంద్రాలుంటాయని, పోలింగ్ కేంద్రాల పరిధిలో 18 ఏండ్లు నిండిన వారందరికీ ఓటు హక్కు కల్పించనున్నట్లు తెలిపారు. అనుమతి లేకుండా గోడలపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేయవద్దని, ప్రభుత్వ స్థలాల వద్ద ప్రచారం చేయవద్దని సూచించారు. జిల్లాలో మొత్తం 7,11,130 మంది ఓటర్లు ఉన్నారని వివరించారు.
ఇందులో స్త్రీలు 3,66,683, పురుషులు 3,44,448, ట్రాన్స్జెండర్లు 49, సర్వీసు ఓటర్లున్నారని వెల్లడించారు. ప్రజాస్వామ్యబద్ధంగా స్వేచ్ఛగా ఓటు వేసుకునేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరుగుతుందన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు కచ్చితంగా నామినేషన్ మొదలుకొని ఓట్లు లెక్కింపు వరకు ఖర్చుల వివరాలను రిటర్నింగ్ అధికారులకు సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. నిర్మల్, ముథోల్, ఖానాపూర్‌కు రిటర్నింగ్ అధికారులుగా ఆర్డీవోలను నియమించినట్లు చెప్పారు.
ఎన్నికల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియాకు వివరించాలన్న ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మీడియా సెల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రతిరోజు ఎన్నికలకు సంబంధించిన అప్డేట్ ఈ మీడియా సెల్లో అందుబాటులో ఉంటాయని వివరించారు. నిరంతరం జిల్లాలో ఎన్నికల అధికారులు, అసిస్టెంట్ అధికారులు, పార్టీల సమావేశాలపై దృష్టి పెడుతామన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్, ఏఎస్పీ, అధికారులు తదితరులు పాల్గొన్నారు.