కడెం, అక్టోబర్ 18 : నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని నిర్మల్ కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. కడెం మండల కేంద్రంలోని జడ్పీ పాఠశాలలో బుధవారం నిర్వహించిన సిస్టమెటిక్ ఓటర్ ఎన్రోల్మెంట్ అండ్ ఎలక్ట్రోరల్ పాటిసిపేషన్ (స్వీప్) కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఖానాపూర్ నియోజకవర్గంలోని కడెం, ఖానాపూర్, పెంబి, దస్తురాబాద్ మండలాలకు సంబంధించిన కార్యక్రమాన్ని డీఆర్డీవో ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా కలెక్టర్ తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. మండల పరిస్థితులను తహసీల్దార్ రాజేశ్వరిని అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి కడెం ప్రాజెక్టు సమీపంలో గల సంపద వనాలను సందర్శించారు. కడెంలో రెండు సంపద వనాలను ఏర్పాటు చేయగా, అందులో నాటిన పలు రకాల మొక్కలను పరిశీలించారు.
అక్కడి నుంచి మండలంలోని పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఆయన, ఏర్పాట్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జడ్పీ పాఠశాలలో ఏర్పాటు చేసిన స్వీప్ కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేశారు. అలాగే ప్రత్యేక ఓటర్ నమోదుకు సంబంధించిన ప్లకార్డులను అధికారులతో కలిసి ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఓటు అనేది రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని సూచించారు. అలాగే 30వ తేదీ వరకు ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా 18 ఏండ్లు నిండిన యువతీయువకులను ఓటర్లుగా చేర్పించేలా బీఎల్వోలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో వివిధ శాఖల అధికారులు సమన్వయంగా పనిచేసి, వందశాతం ఓటు హక్కు వినియోగించేలా కృషి చేయాలని అధికారులను ఆదేశించారు.
స్వీప్, బతుకమ్మ సంబురాలను డీఆర్డీవో ఆధ్వర్యంలో పంచాయతీరాజ్, ఈజీఎస్, ఐకేపీ, ఐసీడీఎస్ సిబ్బంది చేసిన ఏర్పాట్లపై ఆయన అభినందించారు. అనంతరం అధికారులు, మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. ప్రజలకు బతుకమ్మ, దేవీ నవరాత్రులు, దసరా శుభాకాంక్షలు తెలిపారు. మొదటిసారి కడెం మండలానికి వచ్చిన కలెక్టర్‌కు మండల అధికారులు శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో విజయలక్ష్మి, తహసీల్దార్ రాజేశ్వరి, ఎంపీడీవోలు వెంకటేశ్వర్లు, సుధాకర్‌రెడ్డి, మల్లేశం, విజయభాస్కర్‌రెడ్డి, ఐసీడీఎస్ సీడీపీవో సరిత, ఏపీవో జయదేవ్, ఎంపీవోలు ఉపేందర్, రత్నాకర్‌రావు, ఏపీవోలు జయదేవ్, రవిప్రసాద్, రమేశ్, రాజన్న, ఏపీఎంలు రాజారాం, గంగారెడ్డి, గంగాధర్, బోజన్న, నాలుగు మండలాల పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ టీచర్లు, ఈజీఎస్, ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు.
నిర్మల్ టౌన్, అక్టోబర్ 18 : జిల్లాలో పౌర సరఫరాలశాఖ ఆధ్వర్యంలో రైస్‌మిల్లులకు కేటాయించిన ధాన్యానికి సంబంధించిన సీఎంఆర్ఎఫ్ బియ్యం వారంలోగా అందించాలని, లేకపోతే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్‌తో కలిసి సీఎంఆర్ఎఫ్ బియ్యంపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 2022-23 పంట కాలానికి సంబంధించిన బియ్యానిన 12 బయిల్డ్ రైస్ మిల్లులకు, 46 రైస్‌మిల్లులకు రా రైస్ మిల్లర్లకు కేటాయించడం జరిగిందన్నారు.
నిర్ణీత గడువులోగా అందించాలని, ఎన్నోసార్లు ప్రభుత్వం అవకాశం కల్పించిందని తెలిపారు. జిల్లాలో రైస్‌మిల్లర్లు 1,12,678 మెట్రిక్ టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటివరకు 23,891 మెట్రిక్ టన్నులు మాత్ర ఇచ్చారన్నారు. యాసంగికి సంబంధించిన 1,58,666 మెట్రిక్ టన్నుల బియ్యంకు గాను ఇప్పటివరకు 1,06,844 మెట్రిక్ టన్నులు ఇచ్చినట్లు వెల్లడించారు. వారంలోగా ఇవ్వాలని, లేకపోతే చర్యలు తీసుకుంటామన్నారు. పెండింగ్‌లో ఉన్న రైస్‌మిల్లర్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్వో అలీ, డీఎం శ్రీకళ, అధికారులు పాల్గొన్నారు.