ఆదిలాబాద్, ఏప్రిల్ 16(నమస్తే తెలంగాణ) ః కేంద్ర ప్రభుత్వం బడుగు జీవులపై మరోభారం మోపింది. ఇప్పటికే నిత్యావసరాలు, ఇతర ధరల కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలపై టోల్ చార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఆదిలాబాద్ జిల్లాలో 80 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి ఉంది. జైనథ్ మండలంలోని పిప్పర్వాడ, నేరడిగొండ మండలంలోని రోల్మామడ వద్ద హైదరాబాద్-నాగ్‌పూర్ జాతీయ రహదారిపై రోజు 10 వేల వరకు వాహనాలు రాకపోకలు సాగిస్తాయి.
పెంచిన ధరల కారణంగా వాహనదారులపై రోజు రూ.10 లక్షల భారం పడనుంది. పెరిగిన ధరలు ఏప్రిల్ ఒకటి నుంచి అమలవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ అథారిటీ హైవే ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ)టోల్ చార్జీలు పెంచడంతో వాహనదారులు ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తున్నది. రవాణా సరుకులకు తీసుకెళ్లే ట్రాన్స్‌పోర్టు వాహనాలు ఈ రోడ్డు మీదుగా అధికంగా వెళ్తుంటాయి. జిల్లావాసులు తమ అవసరాల కోసం హైదరాబాద్‌తోపాటు మహారాష్ర్టలోని వివిధ ప్రాంతాలకు వెళ్తుంటారు.
రోజు రూ.10 లక్షల అదనపు భారం
ఆదిలాబాద్ జిల్లాలోని జాతీయ రహదారి-44పై నేరడిగొండ మండలంలోని రోల్మామడ, జైనథ్ మండలంలోని పిప్పర్వాడ వద్ద 2008లో ఏర్పాటు చేసి టోల్‌టాక్స్ వసూలు చేస్తున్నారు. ఈ రహదారిపై రోజు కార్లు, బస్సులు, లారీలు, గూడ్స్ వాహనాలు, ఇతర భారీ వాహనాలు 10 వేల వరకు రాకపోకలు సాగిస్తుంటాయి. ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు కూడా వివిధ ప్రాంతాలకు ప్రయాణికులను చేరవేస్తాయి.
ప్రస్తుతం టోల్‌ప్లాజాల్లో కార్లు, వ్యాన్, లైట్ మోటార్ వెహికిల్‌పై 24 గంటల్లో రాకపోకలకు రూ.165, మినీ బస్సు, లైట్ కమర్షియల్ వెహికిల్, లైట్ గూడ్స్ వాహనానికి రూ.265, బస్సులు, ట్రాక్‌లకు రూ.560కి పెరిగింది. ఇతర వాహనాలకు రూ.610, రూ.875, రూ.1065కు ఉంది. పెరిగిన ధరల ఫలితంగా రోజు ప్రయాణికులపై రూ.10 లక్షల భారం పడనుండగా.. నేటి(గురువారం) నుంచి ధరలు అమల్లోకి వస్తాయి. వాహనదారులతోపాటు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే పేదలు కూడా నష్టపోవాల్సి వస్తుంది.
అస్తవ్యస్తంగా రహదారి
ఎన్‌హెచ్-44 నిర్వహణను ఎన్హెచ్ఏఐ అధికారులు గాలికొదిలేశారు. నేరడిగొండ నుంచి జైనథ్ మండలంలోని పిప్పర్వాడ వరకు రోడ్లు నిర్మాణ లోపాల కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల జైనథ్ మండలంలోని భోరజ్ చెక్‌పోస్టు సమీపంలో వరుసగా మూడు రోజులు ప్రమాదాలు జరగ్గా ముగ్గురు చనిపోయారు. రోడ్డుకు ఇరువైపులా అవసరమైన చోట సర్వీస్ రోడ్లు, స్లీప్ రోడ్లు, అండర్ పాస్‌లు చేపట్టలేదు.
ప్రమాదాల నివారణ కోసం చర్యలు తీసుకోవాలని స్థానికులు, వాహనదారులు గతంలో పలుమార్లు నేషనల్ హైవే ఆథారిటీ అధికారులను కోరినా ఫలితం లేదు. జాతీయ రహదారిపై గతంలో మావల క్రాసింగ్, మావల మూలమలుపు, దేవాపూర్ క్రాసింగ్, గుడిహత్నూర్ బస్టాండ్ ఏరియా, గాంధీనగర్, ఉట్నూర్ క్రాస్‌రోడ్డు, సీతాగోంది ప్రాంతాల్లో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వీటిని అధికారులు బ్లాక్ స్పాట్లుగా గుర్తించినా చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. చార్జీలు పెంచుతున్న నేషనల్ హైవే అథారిటీ అధికారులు రోడ్లను బాగు చేయకపోవడంపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
టోల్‌ప్లాజా ధరలతో భారం
పెరిగిన డీజిల్ ధరలతో ఇబ్బందులు పడుతున్నాం. జాతీయ రహదారిపై టోల్‌ప్లాజా ధరలు పెంచడంతో వాహనదారులపై భారం పడనుంది. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వరకు ఐదు టోల్‌ప్లాజాలు ఉంటాయి. రూ.1,500 టోల్‌ప్లాజాలకు చెల్లించాల్సి వస్తుంది. నేషనల్ హైవే అథారిటీ అధికారులు రోడ్ల గురించి పట్టించుకోకుండా ధరలు మాత్రం బాగా పెంచుతున్నారు. రహదారి సరిగా లేని కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. రహదారిపై కనీస సౌకర్యాలు లేవు. నేషనల్ హైవే అథారిటీ అధికారులు పెంచిన ధరలను వెనక్కి తీసుకోవాలి.
– మోహన్, వాహనదారుడు, ఆదిలాబాద్