కేసీఆర్ సర్కారు ఆదిలాబాద్లో కొత్త కలెక్టరేట్ భవనానికి శ్రీకారం చుట్టగా, ప్రస్తుత ప్రభు త్వ నిర్లక్ష్యంతో అర్ధాంతరంగా నిలిచిపో యింది. తప్పనిసరి పరిస్థితుల్లో శిథిలమైన భవనంలోనే కలెక్టరేట్ కొనసాగి స్తుండగా, ఇటీవల కురిసిన వర్షాలకు నాని ఓ పక్క కూలిపోయింది. ఈ నేపథ్యంలో మిగతా విభాగాల్లోనూ ఎప్పుడు ఏం జరుగుతుం దోనని ఉద్యోగులు భయం భయంగా విధులు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వ పట్టింపులేని తనంతో సిబ్బందికి ప్రాణసంకటంగా మారగా, ఇకనైనా కొత్త కలెక్టరేట్పై దృష్టి పెడుతుందో లేదో చూడాలి మరి..
ఆదిలాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ) : ప్రస్తుత ఆదిలాబాద్ కలెక్టరేట్ భవనం 80 ఏళ్ల క్రితం (నిజాం కాలం) నాటిది. ఈ భవనం శిథిలావస్థకు చేరడంతో ఎప్పుడు కూలుతుందోనని ఆయా విభాగాల అధికారులు, సిబ్బంది భయం..భయంగా విధులు నిర్వహించేవారు. ఇటీవల కురిసిన వర్షాలకు భవనం నాని మరింత దెబ్బతిన్నది. ఈ క్రమంలో గురువారం సాయంత్రం ఒక్కసారిగా భవన సముదాయంలోని ఓ విభాగం కూలిపోయింది. అక్కడున్న కొంతమంది ఉద్యోగులు, ట్రెజరీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులు ప్రమాదాన్ని ముందుగా గమనించి అక్కడి నుంచి పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకున్నారు. మరికొంత మంది అధికారులు, సిబ్బంది మంత్రి జూపల్లి పర్యటన సందర్భంగా నిర్వహించిన సమీక్షా సమావేశానికి వెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనతో కలెక్టరేట్లో పని చేసే అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. శిథిలావస్థకు చేరి కూలుతున్న భవనంలో విధులు ఎలా నిర్వహించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం సకల సౌకర్యాలతో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కొత్త కలెక్టరేట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. రూ. 55 కోట్లతో సర్వే నంబర్ 72 /1 / 6లో.. 19 ఎకరాల్లో కొత్త కలెక్టరేట్ భవన నిర్మాణాన్ని చేపట్టింది. అధికారులు రూపొందించిన ప్లాన్ ప్రకారం 1.20 లక్షల స్కేర్ ఫీట్లతో జీ ప్లస్ 2 అంతస్తులతో వివిధ కార్యాలయాల సముదాయాలను నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించారు. 2023 జూన్లో పనులు ప్రారంభించారు. కానీ, కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి రాగానే పట్టించుకోకపోవడంతో భవన నిర్మాణం అర్ధాంతరంగా నిలిచిపోయింది. ప్రస్తుతమున్న ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ, ఇతర శాఖల కార్యాలయాలు మాత్రమే ఉన్నాయి. ప్రభుత్వం పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తుండడంతో ప్రజలు తమ పనుల కోసం జిల్లాలోని వివిధ ప్రభుత్వశాఖల కార్యాలయాలకు వస్తుంటారు. పలు శాఖల ఆఫీసులు దూరంగా ఉండడంతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం నూతనంగా నిర్మించే కలెక్టరేట్లో అన్ని శాఖలకు సంబంధించిన కార్యాలయాలు అందుబాటులోకి వచ్చేలా గత బీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. భవన నిర్మాణ పనులను రోడ్లు భవనాల శాఖ (ఆర్అండ్బీ) అధికారులు పర్యవేక్షించగా, హైదరాబాద్కు చెందిన ఓ సంస్థ పనులు చేపట్టింది. పిల్లర్లు, స్లాబ్ వరకు పనులు పూర్తయ్యాయి. సంబంధిత కాంట్రాక్టర్కు ఇప్పటి వరకు చేసిన పనుల బిల్లులు రాకపోవడంతో నిలిపివేశారు. రెండేళ్లు కావస్తున్నా నిర్మాణ పనులు ప్రాథమిక దశలోనే ఉన్నాయి. దీంతో నూతన కలెక్టర్ కార్యాలయం భవన నిర్మాణం జరుగుతుందా ? లేదా ? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా ప్రజల సౌకర్యార్థం కొత్త కలెక్టరేట్ భవన నిర్మాణాన్ని పూర్తి చేసి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకే చోట ఉండేలా సర్కారు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
వర్షాలతో కూలిన ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయం భవనాన్ని శుక్రవారం నిపుణుల కమిటీ పరిశీలించింది. హైదరాబాద్ నుంచి వచ్చిన నిపుణుల కమిటీ సభ్యులు అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవి, ఇతర అధికారులతో కలిసి భవనాన్ని పరిశీలించారు. బీఆర్ఎస్ నాయకులు సైతం వినూత్నంగా నిరసన తెలిపారు. హెల్మెట్లు ధరించి భవనాన్ని పరిశీలించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన కొత్త కలెక్టరేట్ భవనం నిర్మాణాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ కార్యాలయంలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, స్థానికులు సైతం పెద్దసంఖ్యలో వచ్చి కూలిన భవనాన్ని చూశారు. భవనం కూలిన సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని చర్చించుకున్నారు.