జైనథ్, జనవరి 15 : వాహనదారులు విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని నేషనల్ హైవే పీఆర్వో కేసర్ సింగ్ అన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా బుధవారం ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం డొల్లర గ్రామంలో వివిధ వాహనదారులు, గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ మద్యం తాగి వాహనాలు నడపరాదన్నారు. జిబ్రా క్రాసింగ్ గుర్తులను పాటించాలని సూచించారు. అతివేగంగా వాహనాలు నడుపొద్దని సూచించారు. కార్యక్రమంలో ఏఈపీఎల్ సిబ్బంది ఎస్ శంకర్, ఎస్ చంద్రపతి, డీఐఆర్ నర్సింహ, వాహనదారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
బేల, జనవరి 15: వాహనదారులు తమ వెంట లైసెన్స్, ఇన్సూరెన్స్ సరైన వాహన పత్రాలు లేకుంటే వాహనాలు సీజ్ చేస్తామని సీఐ సాయినాథ్ అన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా మంగళవారం ఆదిలాబాద్ జిల్లా బేలలోని వారసంతలో ఎస్ఐ దివ్యభారతితో కలిసి ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జైనథ్ సీఐ సాయినాథ్ మాట్లాడుతూ రోడ్డు భద్రత నియమావళిని పాటిస్తే ప్రమాదాలు నివారించ వచ్చని తెలిపారు. సంబంధిత డ్రైవర్లు ఫిట్నెస్తో పాటు వాహనాలు కండిషన్లో ఉండాలని పేరొన్నారు. లైసెన్స్ లేని డ్రైవర్లు మండల ఎస్ఐ దగ్గర పేర్లు నమోదు చేస్తే ఆర్టీఓ కార్యాలయానికి పంపించి లైసెన్స్లు సత్వరమే వచ్చేలా చూస్తామని అన్నారు. కార్యక్రమంలో ఎస్ఐ దివ్యభారతి, ట్రైనీ ఎస్ఐ సాయిరామ్, మండల ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.
బాసర, జనవరి 15 : వాహనాదారులు ఎల్లప్పుడు తమ వెంట ధృవీకరణ పత్రాలు ఉంచుకోవాలని ఎస్ఐ గణేశ్ అన్నారు. మంగళవారం రాత్రి నిర్మల్ జిల్లా బాసరలో వాహనదారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి అవగాహన కల్పించారు. ప్యాసింజర్ వాహనదారులు పరిమితిని మించి ప్రయాణికులను ఎక్కించి ప్రాణాల పైకి తెచ్చుకోవద్దని, మద్యం తాగి వాహనాలు నడపరాదని, ప్రతి ఒక్కరూ లైసెన్స్ కలిగి ఉండాలని, రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎస్ఐ లక్ష్మణ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.