పల్లెల వికాసమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ క్రమం తప్పకుండా గ్రామపంచాయతీలకు నిధులు
విడుదల చేస్తున్నారు. జనాభా ప్రతిపాదికన నెల నెలా నిర్ధిష్టమైన నిధులను జిల్లా, మండల పరిషత్, పంచాయతీలకు కేటాయిస్తున్నారు. వాటితోనే గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఏర్పడుతున్నది. పారిశుధ్యం, పచ్చదనానికి అధిక ప్రాధాన్యం ఇస్తుండడంతో పల్లె వాతావరణంలో స్పష్టమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలోనూ ఏప్రిల్, మే నెలకు సంబంధించిన నిధులు మంజూరు కాగా, ప్రస్తుత నెల నిధులు మరో వారం రోజుల్లో ట్రెజరీల్లో జమ కానున్నట్లు తెలిసింది. ప్రతి నెలా ఉమ్మడి జిల్లాకు రూ.33.52 కోట్ల రూపాయలను ఆర్థిక సంఘం నిధులతో కలుపుకొని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్నది.
నల్లగొండ ప్రతినిధి, జూన్17 (నమస్తే తెలంగాణ) : పల్లెల రూపురేఖలు మార్చాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రత్యేకంగా దృష్టి సారించింది. నిధులు లేక కునారిల్లుతున్న గ్రామ పంచాయతీలకు చేయూతనిచ్చేందుకు వినూత్నంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచించారు. గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు జనాభా ప్రతిపాదికగా నిధులను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇలా 2019 సెప్టెంబర్ నుంచి నేటి వరకు ప్రతీ నెలా నిధులను విడుదల చేస్తూ వస్తున్నారు.
జిల్లా పరిషత్, మండల పరిషత్‌లకు కలిపి 15 శాతం నిధులను, మిగిలిన 85 శాతం నిధులను గ్రామ పంచాయతీలకు మంజూరీ చేస్తున్నారు. ఈ నిధుల్లో జనరల్ ఫండ్‌తో పాటు ఎస్సీ, ఎస్టీ కాంపోనెంట్ ఫండ్లు గానూ పరిగణలోకి తీసుకుని ఖర్చు చేస్తున్నారు. ఇలా నల్లగొండ జిల్లాలో 12.23 లక్షల జనాభాకు గానూ రూ.15.65 కోట్లు, సూర్యాపేట జిల్లాలో 8.21 లక్షల జనాభాకు రూ.10.53 కోట్లు, యాదాద్రిభువనగిరి జిల్లాలో 6.14 లక్షల జనాభాకు రూ.7.34 కోట్ల నిధులను ప్రతీ నెలా విడుదల చేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌కు సంబంధించిన నిధులు మే 4వ తేదీన విడుదల కాగా మే నెలకు సంబంధించిన నిధులు ఈ నెల 4న విడుదలయ్యాయి. ఈ నిధులను ఆయా జిల్లాల ట్రెజరీల్లో జమ చేస్తున్నారు.
ప్రస్తుత నెలకు సంబంధించిన నిధులు మరో వారం, పది రోజుల్లో ట్రెజరీల్లో జమ అవుతాయని అధికారులు చెబుతున్నారు. ఈ నిధులతో పల్లె వాతావరణంలో కీలకమైన పరిశుభ్రత, పచ్చదనానికి పెద్దపీట వేస్తున్నారు. వీటితో ప్రత్యేకంగా మొక్కలు నాటడం, వాటి పెంపకం కోసం గ్రీన్ బడ్జెట్ పేరుతో 10 శాతం నిధులను వినియోగిస్తున్నారు. ఇక ట్రాక్టర్, ట్రాలీ ఈఎంఐల చెల్లింపులు, వీధి దీపాల నిర్వహణ, తాగునీటి పైప్లైన్ల మరమ్మతులు తదితరాలకు వినియోగిస్తున్నారు. మేజర్ గ్రామ పంచాయతీల్లో నిధులు మిగులుబాటు అవుతుండడంతో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారు. దీంతో పల్లె పాలనలో ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా రోజువారీ పాలన వ్యవహారాలు సజావుగా సాగేందుకు తోడ్పడుతుంది.
గతంలో ఇలా నెలనెలా నిధులు లేనప్పుడు పంచాయతీలకు నిధుల కొరత తీవ్రంగా వేధిస్తుండేది. ఆస్తి పన్ను, నల్లా బిల్లుల వసూలు తప్పా ఇతరత్రా ప్రభుత్వం నుంచి పెద్దగా సహకారం ఉండేది కాదు. నేడు పల్లెల్లో మౌలిక వసతుల కల్పనకు ఈ నిధులు వినియోగిస్తుండడంతో పాలనలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. దీంతో పల్లె ప్రజలు కూడా క్రమ తప్పకుండా ఆస్తి పన్ను, ఇతర పన్నులు చెల్లిచేందుకు ముందుకు వస్తుండడంతో పంచాయతీలకు ఆర్థికంగా ఎంతో ఉపయుక్తంగా మారింది. దీంతో ప్రస్తుతం నిర్వహిస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమంలోనూ పలు పనులు చేపట్టేందుకు ఈ నిధులు ఎంతో తోడ్పతున్నాయని పంచాయతీ పాలకవర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.
జిల్లా, మండల పరిషత్‌లతో పాటు గ్రామ పంచాయతీలకు ప్రతి నెలా నిధులు విడుదల అవుతున్నాయి. ప్రస్తుత నెలకు సంబంధించిన నిధులు కూడా మరో పది రోజుల్లో రావొచ్చు. ఈ నిధులతో గ్రామాల్లో నిత్యం పారిశుధ్యం, తాగునీరు వ్యవస్థతో పాటు ఇతర అవసరాలకు ఇబ్బందులు లేకుండా పోయాయి. ప్రతి నెలా నల్లగొండ జిల్లాకు రూ.15.65 కోట్లు వస్తున్నాయి. వీటితో గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన ఎంతో మెరుగుపడింది.
– విష్ణువర్ధన్‌రెడ్డి, డీపీఓ, నల్లగొండ