‘అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ దేశానికే రోల్ మోడల్‌గా నిలిచింది. సీఎం కేసీఆర్ స్వరాష్ట్ర కాంక్షలను నెరవేర్చిఎనిమిదేండ్లలో రాష్ర్టాన్ని ప్రగతి పథంలోకి తీసుకెళ్లారు. ఎంతో మంది పేదల బతుకులకు భరోసా కల్పిస్తూ పాలనసాగిస్తున్నారు. నాడు ఉద్యమ సమయంలో తెలంగాణ వస్తే ఏం కావాలని ప్రజలు కోరుకున్నారో అవి నేడు కండ్ల ముందు సాక్షాత్కరిస్తున్నాయి’అని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా గురువారం కలెక్టరేట్లోజెండావిష్కరించి మాట్లాడారు. సూర్యాపేట జిల్లా ప్రగతిని వివరించారు. ప్రాజెక్టుల పూర్తితో పుష్కలంగా సాగు నీరు, 24 గంటల ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమాతో రైతులకు భరోసా ఏర్పడిందన్నారు.
మన ఊరు..మన బడి కార్యక్రమంతో స్కూళ్లు కార్పొరేట్‌కు దీటుగా మారనున్నాయని, దళిత బంధు పథకంతో దళితులు ఆర్థిక పురోభివృద్ధి సాధిస్తున్నారని తెలిపారు. వివిధ వృత్తిదారులకు చేయూత, పల్టె, పట్టణ ప్రగతితో ప్రజలు సంతోషంగా జీవనం సాగిస్తున్నారన్నారు. జిల్లా సర్వతోముఖాభివృద్ధికి తన శక్తియుక్తులన్నీ కూడగట్టుకొని కృషి చేస్తానని, సంక్షేమ ఫలాలు ప్రతి గడపకూ చేరాలని అధికారులకు సూచించారు.
‘ఉద్యమ ప్రారంభంలో రాష్ట్రం సిద్ధిస్తే ఏం ప్రయోజనాలు ఉంటాయని టీఆర్ఎస్ చెప్పిందో.. నేడు అవన్నీ కళ్ల ఎదుట సాక్షాత్కరిస్తున్నాయి. సీఎం కేసీఆర్ ముందుచూపుతో రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగతి సాధించి సత్ఫలితాలు వస్తుండడంతో ప్రజలు సంతోషంగా జీవనం సాగిస్తున్నారు. జిల్లా సర్వతోముఖాభివృద్ధ్దికి తన శక్తియుక్తులన్నీ కూడగట్టుకొని కృషి చేస్తాను. సంక్షేమ ఫలాలు ప్రతి గడపకూ చేరాలి.’ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం కలెక్టరేట్ ఎదుట జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, జడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపికాయుగంధర్, జిల్లా కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి, ఎస్పీ రాజేంద్రప్రసాద్, అదనపు కలెక్టర్లు ఎస్.మోహన్‌రావు, పాటిల్ హేమంత్ కేశవ్‌తో కలిసి అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా పురోగతిపై వివరించారు.
2021-22 సంవత్సరంలో వానకాలం, యాసంగిలో రైతులు పండించిన 1,045 కోట్ల వ్యయం చేసే ధాన్యాన్ని ప్రభుత్వం నేరుగా కొనుగోలు చేసిందన్నారు. జిల్లాలో 2,52,960 మంది రైతులకు వానకాలంలో రూ.308 కోట్లు, యాసంగిలో 309 కోట్ల రూపాయలు పెట్టుబడి సాయం అందించినట్లు తెలిపారు. రైతుబంధు ద్వారా ఇప్పటి వరకు 2,108కోట్ల రూపాయల నగదు రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు.
రైతు బీమా కింద ఇప్పటి వరకు 496 మంది రైతుల నామినీలకు రూ.25కోట్ల ఇన్సూరెన్స్ అందజేసినట్లు తెలిపారు. రైతు రుణమాఫీ కింద రూ.25వేల రుణం పొందిన 14,600 మంది రైతులకు రూ.19కోట్లు మాఫీ చేశామన్నారు. రూ.50వేల వరకు రుణం తీసుకున్న 6,072 మంది రైతులకు 36కోట్లా 15లక్షల రూపాయలు మాఫీ చేసినట్లు తెలిపారు.
2021-22 వానకాలంలో జిల్లా పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో 165 ఐకేపీ కేంద్రాల ద్వారా 36,034 మంది రైతుల వద్ద 359 కోట్ల రూపాయలతో లక్షా 83వేల 124 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేశామన్నారు. 120 పీఏసీఎస్ సెంటర్ల ద్వారా 21,804మంది రైతుల వద్ద లక్షా 39వేల 659 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైతులకు 274 కోట్లు చెల్లించామని చెప్పారు. ఆయిల్‌పామ్ తోటల పెంపకం కింద ఈ ఆర్థిక సంవత్సరం 7,750 ఎకరాల లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 630మంది రైతులకు చెందిన 4,036 ఎకరాలను గుర్తించినట్లు చెప్పారు. పట్టు పరిశ్రమ కింద జిల్లాలో 104 ఎకరాల మల్బరీ సాగులో ఉండగా ఈ సంవత్సరం వం ఎకరాల్లో నాటేందుకు లక్ష్యంగా నిర్దేశించినట్లు తెలిపారు.

మిషన్ కాకతీయ ద్వారా జిల్లాలోని అన్ని చెరువుల్లో పూడిక తీత పనులు పూర్తయ్యాయని మంత్రి అన్నారు. 4 మినీ ట్యాంక్‌బండ్‌లకు రూ.47కోట్లు మంజూరు కాగా.. సూర్యాపేట సద్దుల చెరువు పూర్తయిందని, మిగిలినవి పురోగతిలో ఉన్నాయని చెప్పారు. 43 చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి రూ.265కోట్లు మంజూరు కాగా ఇప్పటి వరకు 117కోట్ల రూపాయల పనులు జరిగాయన్నారు. మూసీ నది ఆధునీకరణకు రూ.66కోట్లు మంజూరు చేయగా.. 30కోట్ల రూపాయల పనులు పూర్తయ్యాయని, మిగిలినవి పురోగతిలో ఉన్నాయని తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా జిల్లాలో రూ.855 కోట్లతో ఒక జల శుద్ధి, 40 జల బాంఢాగారాలు నిర్మించామని, 1693 కిలోమీటర్ల పైప్‌లైన్ నిర్మాణం పూర్తి చేసినట్లు తెలిపారు.
జిల్లాలో లక్షా 40వేల 600 మంది రైతులు ఉచిత విద్యుత్‌తో లబ్ధి పొందుతున్నారని మంత్రి తెలిపారు. అన్నారిగూడెంలో రూ.2కోట్లతో చేపట్టిన సబ్ స్టేషన్ నిర్మాణ దశలో ఉందన్నారు. రూ.8.93కోట్లతో 1900 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయగా.. రూ.10కోట్లతో 218కిలోమీటర్ల 11కేవీ లైన్లు, 11.86కోట్లతో 380 కిలోమీటర్ల ఎల్టీ లైన్లు, రూ.5.23కోట్లతో 5,300 మధ్య పోల్స్, డ్యామేజ్ పోల్స్ తొలగించి కొత్తవి ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
పల్లె ప్రగతి ద్వారా ఉపాధి హామీ, గ్రామ పంచాయతీ నిధులతో 475 గ్రామాల్లో సెగ్రిగేషన్ షెడ్లు, 679 పల్లె ప్రకృతి వనాలు, 475 వైకుంఠధామాలను నిర్మించారన్నారు. జిల్లాలో దళితబంధు పథకం కింద రూ.23.25కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణ, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఉప్పల లలితాఆనంద్, గ్రంథాలయ సంస్థ చైర్మన నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

2021-22లో జిల్లాలోని 850 నీటి వనరుల్లో 3కోట్ల 60లక్షల చేప పిల్లలు వదిలినట్లు తెలిపారు. ఇందుకోసం 3.55 కోట్ల రూపాయలు చేశామన్నారు. సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ద్వారా జిల్లాలో 2021-22లో 25లక్షల 45వేల మంచినీటి రొయ్య పిల్లలను పంపిణీ చేసినట్లు చెప్పారు. 109 చేపల చెరువులు, 639 ఫామ్ఫాండ్స్ పూర్తి చేశామన్నారు.

జిల్లాలో సాగునీటి రంగం బాగుపడడంతో రైతులు సంతోషంగా పంటలు పండించుకుంటున్నారు. జిల్లాలో శ్రీరాంసాగర్ ప్రాజెకు కాల్వల లైనింగ్ కోసం రూ.400 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించినట్లు తెలిపారు. నాగార్జున సాగర్ ఎడమ కాల్వ లైనింగ్, ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ లైనింగ్, జాన్‌పహాడ్ బ్రాంచ్ కెనాల్ లైనింగ్, జాన్‌పహాడ్ బ్రాంచ్ కెనాల్ లిఫ్ట్, ఆర్-9 లిఫ్ట్ పనులకు రూ.345కోట్లతో టెండర్లు పిలిచినట్లు చెప్పారు.

జిల్లాలో ప్రభుత్వ వైద్య రంగానికి భారీగా ఖర్చు చేస్తూ మౌలిక వసతులు కల్పించి పేద, మధ్య తరగతి వర్గాలకు వైద్యం చేరువ చేశామన్నారు. జిల్లాలో 64 పల్లె దవాఖానలతో వైద్య సేవలు అందించనుండగా.. మొదటి విడుతలో 31 భవనాలు నిర్మించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 594 ప్రసవాలు కాగా.. 505 మందికి కేసీఆర్ కిట్లు అందజేశామన్నారు. రూ.485 కోట్లతో ప్రభుత్వ వైద్య కళాశాల భవన నిర్మాణం పూర్తి కాగా.. విద్యార్థి వసతి గృహం పురోగతిలో ఉందన్నారు. జిల్లా జనరల్ ఆసుపత్రి స్థాయి వంద నుంచి 300 పడకలకు పెంచి మెడికల్ విద్యాశాఖకు అప్పగించినట్లు తెలిపారు. జిల్లాలో 31హెల్త్ సబ్ సెంటర్ల నిర్మాణానికి రూ.4.96కోట్లు మంజూరయ్యాయని చెప్పారు.
