మంచిర్యాలటౌన్, ఆగస్టు 31 : మంచిర్యాల పట్టణ ప్రాంతాల్లో శిథిలమై కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న భవనాలపై మున్సిపల్ కార్పొరేషన్ దృష్టి పెట్టింది. వాటిని తొలగించేందుకు చర్యలు చేపడుతున్నది. వర్షాలకు పాత భవనాలు, పాత కట్టడాలు నానిపోయి కూలిపోయే ప్రమాదముంటుందని, తద్వారా ఆస్తినష్టంతో పాటు ప్రాణనష్టం సంభవించే అవకాశాలుంటాయని ప్రభుత్వం భావిస్తోంది. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లలో శిథిలమైన, ప్రమాదకరంగా ఉన్న 43 భవనాలు, నివాసాలను అధికారులు గుర్తించారు. వాటి యజమానులకు నోటీసులు కూడా అందజేశారు. ఇందులో ఇప్పటి వరకు 10 భవనాలను మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. మరో 11భవనాలు, నివాసాలను వాటి యజమానులు సొంతంగా కూల్చివేసుకున్నారు.
మిగిలిన వాటి విషయంలో త్వరలో నిర్ణయం తీసుకుంటామని టీపీఎస్ శ్యాంసుందర్ తెలిపారు. నగరంలోని దొరగారిపల్లి, తిలక్‌నగర్, సాయికుంట, పాత మంచిర్యాల, గోపాల్‌వాడ, సున్నంబట్టివాడ, లేబర్‌కాలనీ, రెడ్డికాలనీ, రాళ్లపేట, రాంనగర్, చింతపండువాడ, మున్సిపల్ ఆ ఫీస్, నస్పూరు, ముల్కల, వేంపల్లి ఏరియా ల్లో శిథిల, పాడైపోయిన భవనాలను మున్సిపల్ అధికారులు గుర్తించారు. మరికొన్ని చోట్ల భవనాల్లోకి వరద రాకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత యజమానులకు కార్పొరేషన్ అధికారులు సూచిస్తున్నారు.