ఎదులాపురం, ఫిబ్రవరి 20 : నేరస్తులకు న్యాయస్థానంలో శిక్షల శాతం పెరగినప్పుడే నేరాలు తగ్గుముఖం పడుతాయని మల్టీజోన్-1 ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలోకు మొదటిసారిగా వచ్చారు. కాగా ఆదిలాబాద్‌లో ఎస్పీ డీ ఉదయ్‌కుమార్ రెడ్డి ఆయనకు ఘనస్వాగతం పలికారు. ముం దుగా స్థానిక పోలీస్ గెస్ట్ హౌస్‌లో ఆర్ఎస్ఐ మహేందర్ నేతృత్వంలోని సాయుధ దళంతో గౌరవ వందనాన్ని స్వీకరించారు.
అనంతరం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐ జీ మాట్లాడుతూ.. నేరాల నియంత్రణలో ముం దస్తు సమాచారం సేకరించడం కీలక అంశమని పేర్కొన్నారు. న్యాయస్థానాల్లో సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సాక్షాధారాలను వినియోగించడం వల్ల శిక్ష రుజువు శాతం పెంపొందించవచ్చని తెలిపారు. మహారాష్ట్ర సరిహద్దుగా ఉన్నదని, అంతర్రాష్ట్ర నేరస్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నదన్నారు. అలాగే జాతీయ రహదారులపై ఎప్పుడూ పెట్రోలింగ్ నిర్వహిస్తూ ఉండాలని సూచించారు.
జిల్లా వ్యాప్తంగా సీసీ కెమెరాల పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలని, అన్ని పోలీస్ స్టేషన్లలో డయల్ 100, బ్లూ కోల్డ్స్ నిర్వర్తించే అధికారులు ఎప్పడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏ సందర్భంలోనైనా ఐదు నిమిషాల్లోపే సంఘటనా స్థలానికి చేరుకొని ప్రజలకు నమ్మకం కలిగేలా విధులు నిర్వర్తించాలన్నారు. అనంతరం జిల్లా పోలీసు అసోసియేషన్ తరఫున అధ్యక్షుడు పెంచాల వెంకటేశ్వర్లు, సభ్యులు గిన్నెల సత్యనారాయణ, చిందం దేవిదాస్ ఐజీకి పూలమొక్క అందించి, శాలువాతో సత్కరించారు.
అలాగే జిల్లా కేంద్రంలో భరోసా సెంటర్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఆయన వెంట అదనపు ఎస్పీలు బీ రాములు నాయక్, సీ సమయ్ జాన్ రావు, డీఎస్పీలు వీ ఉమేందర్, ఉమామహేశ్వరరావు, పోతారం శ్రీనివాస్, కార్యాలయ ఏవో యూనుస్ అలీ, సూపరింటెండెంట్లు జోసెఫిన్, గంగాధర్, సీసీ దుర్గం శ్రీనివాస్, సీఐలు, ఆర్ఐ సీఐలు ఎస్ఐలు సిబ్బంది తదితరులున్నారు.
నిర్మల్ జిల్లాలో..
నిర్మల్ అర్బన్, ఫిబ్రవరి 20 : నిర్మల్ జిల్లాకు వచ్చిన ఐజీ చంద్రశేఖర్‌రెడ్డికి ఎస్పీ ప్రవీణ్‌కుమార్ పుష్పగుచ్ఛం అందించి, స్వాగతం పలికారు. పోలీసు గెస్ట్ హౌస్‌లో సాయుధ దళంతో గౌరవ వందనం స్వీకరించారు. పోలీసు కార్యాలయంలో జిల్లా పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. జాతీయ రహదారులపై పోలీసులు నిత్యం తనిఖీలు చేపట్టాలని సూచించారు. వర్టికల్ను సక్రమంగా అమలుపర్చాలని, జిల్లా వ్యాప్తంగా మట్కా, గంజాయి పేకాట, వ్యభిచారం లాంటి అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా అంతమొదించాలని వివరించారు.
జిల్లాలో మతసామరస్యం పెంపొందించేలా పోలీసు కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఉత్తమ పోలీసు స్టేషన్లుగా ఎంపికైన వారికి జ్ఞాపికలను అందించారు. నూతనంగా నిర్మిస్తున్న జిల్లా పోలీసు కార్యాలయాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, భైంసా ఏఎస్పీ కాంతిలాల్‌పాటిల్, డీఎస్పీలు జీవన్‌రెడ్డి, సీఐలు, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు.