చెన్నూర్ పట్టణం సమీపం నుంచి నిర్మిస్తున్న బైపాస్ రోడ్డు నిర్మాణం అసంపూర్తిగా మిగలడంతో కంకర తేలిన దారిలో నిత్యం రాకపోకలకు వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరు చేసి సగానిపైగా రోడ్డు నిర్మాణం పూర్తి చేశారు. ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ సర్కారు గానీ, రాష్ట్ర మంత్రి, స్థానిక ఎమ్మెల్యే వివేక్ గానీ ఈ రోడ్డును పట్టించుకోకపో వడంతో పట్టణవాసుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
చెన్నూర్, జనవరి 4 : చెన్నూర్ నుంచి కోటపల్లి, వేమనపల్లి మండలాలకు సంబంధించిన గ్రామాలకు వెళ్లే వాహనాలు పట్టణంలోని ప్రధాన రహదారి గుండానే వెళ్తుంటాయి. రోజు రోజుకూ వాహనాల సంఖ్య కూడా పెరగడం, ప్రధాన రహదారి ఇరుకుగా ఉండడంతో రాకపోకలకు ప్రతి రోజూ తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రధాన రహదారిలో వాహనాల ట్రాఫిక్ తగ్గించాలనే లక్ష్యంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పట్టణం పక్క నుంచి బైపాస్ రోడ్డును నిర్మాణం చేపట్టారు. బుద్ధారం రోడ్డు నుంచి కొత్తగూడెం కాలనీ మీదుగా పెద్ద చెరువు కట్ట (రావిచెట్టు) వరకు బైపాస్ రోడ్డును నిర్మించేందుకు అప్పటి ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ రూ.8 కోట్లను మంజూరు చేయించారు.
ఈ నిధులతో బైపాస్ రోడ్డు నిర్మాణంలో భాగంగా బుద్ధారం రోడ్డు (బైపాస్ రోడ్డు ప్రారంభం) నుంచి కొత్తగూడెం కాలనీ వరకూ సిమెంట్ రోడ్డును నిర్మించారు. బైపాస్ రోడ్డుకు వర్షం నీటి వరద వచ్చి కోతకు గురయ్యే అవకాశాలుండడంతో రోడ్డు కోతకు గురికాకుండా సైడ్ వాల్స్ నిర్మించారు. బైపాస్ రోడ్డులో అవసరమైన నాలుగు కల్వర్టులతో పాటు వడ్డేపల్లి కాలనీ వద్ద పెద్ద బ్రిడ్జిని నిర్మించారు. బైపాస్ రోడ్డుకు సైడ్ లైటింగ్ (వీధి దీపాలను) కూడా ఏర్పాటు చేశారు. దీంతో బీఆర్ఎస్ హయాంలో బుద్ధారం రోడ్డు (బైపాస్ రోడ్డు ప్రారంభం) నుంచి పట్టణంలోని కొత్తగూడెం కాలనీ వరకు పనులు జరిగాయి. ఇంతలోనే శాసన సభ ఎన్నికలు జరగడం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో బైపాస్ రోడ్డు నిర్మాణ పనులు నిలిచి పోయాయి.
అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు, ఇక్కడి నుంచి గెలిచిన మంత్రి వివేక్ బైపాస్ రోడ్డు గురించి పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. కొత్తగూడెం కాలనీ నుంచి పెద్ద చెరువు కట్ట (రావి చెట్టు) వరకు మాత్రమే బైపాస్ రోడ్డు నిర్మాణం మిగిలింది. మిగిలిన ఈ రోడ్డులో కేవలం సిమెంటు రోడ్డు మాత్రమే నిర్మిస్తే ఇబ్బందులు తీరేవి. బీఆర్ఎస్ ప్రభుత్వం, అప్పటి ఎమ్మెల్యే బాల్క సుమన్ హయాంలోనే బైపాస్ రోడ్డు నిర్మాణం పనులు సగానికిపైగా పూర్తయిందని, మిగిలిన పనులు ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయలేకపోతున్నదని ప్రజలు మండిపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, ఇక్కడ నుంచి మంత్రి వివేక్ గెలిచి రెండేళ్లయినా బైపాస్ రోడ్డును పట్టించుకోకపోవడంపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మంత్రి వివేక్ స్పందించి నిధులు మంజూరు చేయించి బైపాస్ రోడ్డును త్వరగా పూర్తి చేసి, రాకపోకలకు ఇబ్బందులు తొలగించాలని పట్టణవాసులు కోరుతున్నారు.