సిర్పూర్(టీ), నవంబర్ 12 : కాగజ్‌నగర్ పట్టణం నుంచి టోంకిని సిద్ధి హనుమాన్ ఆలయం వరకు మంగళవారం ని ర్వహించిన 23వ మహాపాదయాత్రకు భక్తజనం పోటెత్తింది. మంగళవారం తెల్లవారు జామున 3 గంటల నుంచే ప్రారంభమైన మహాపాదయాత్ర మధ్యాహ్నం వరకు కొనసాగింది. జిల్లాలోని పలు మండలాల నుంచేగాక అనేక గ్రామాల నుం చి 20 వేల మందికిపైగా తరలిరాగా, దారులన్నీ కిక్కిరిశాయి. పాదయాత్రగా వస్తున్న భక్తులకు కొందరు పండ్లు ఫలహారాలతో పాటు ఛాయ్ అందించారు. భక్తులు ఆలయానికి చేరుకొని క్యూ కట్టి అంజన్నను దర్శించుకున్నారు. దేవస్థానం పరిసరాలు కిటకిటలాడాయి. సిర్పూర్(టీ) జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి అజయ్ ఉల్లం, సిర్పూర్(టీ) ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు వేర్వేరుగా పూజలు చేశారు. సిర్పూర్(టీ) నియోజకవర్గ పరిధిలోని అధికారులు, రాజకీయ నాయకులు స్వామి వారికి మొక్కులు తీర్చుకున్నారు.
భక్తులకు అన్నదానం
టోంకిని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. మండలకేంద్రంలోని బస్టాండ్ చౌరస్తాలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యంలో నాయకులు బాదం పాలు అందించారు. డౌనల్ ప్రాంతంలో ఎమ్మెల్యే హరీశ్‌బాబు ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు జ్యూస్‌లు, కాంగ్రెస్ నాయకుడు రావి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నాయకులు, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ నాయకులు పండ్లు, మజ్జిగ, పాలు, చాయ్ అందించారు.
భారీగా పోలీసు బందోబస్తు
కాగజ్‌నగర్ పట్టణం నుంచి మహాపాదయాత్రగా వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా కాగజ్‌నగర్ డీఎస్పీ రామానుజం ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. టోంకిని ఆలయాన్ని డీఎస్పీ సందర్శించారు. కౌటల సీఐ రమేశ్ , సిర్పూర్(టీ) సీఐ కమలాకర్, ఎస్ఐలు మధుకర్, విక్రమ్ బందోబస్తులో పాల్గొన్నారు.