నిర్మల్, జూన్ 24(నమస్తే తెలంగాణ) : రైతు బంధు.. అన్నదాతల పాలిట ఆత్మబంధువుగా మారింది. ఒకప్పుడు రైతులు పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారులు, బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. స్ధిరాస్తులు, చరాస్తులు అమ్మి, బంగారం కుదువ పెడితేగాని రుణం దొరికేది కాదు. కొన్ని సందర్భాలలో విత్తనాలు, ఎరువులు కొనలేక సాగుకు దూరంగా ఉన్న దుర్భర పరిస్థితులు ఉండే. వ్యవసాయ సంక్షోభ నివారణ, రైతన్నకు ఆర్థిక చేయూత కోసం సీఎం కేసీఆర్ మదిలో మెదిలిన పథకం రైతుబంధు. ఇప్పటివరకు పది విడుతలుగా యేడాదికి ఎకరాకు రూ.10 వేల చొప్పున అందిస్తుండగా.. పదకొండో విడుతకు అధికారులు సన్నద్ధం అవుతున్నారు. వానకాలం పంటకు రేపటి(సోమవారం) నుంచి డబ్బులు రైతన్నల ఖాతాల్లో జమకానుండగా.. పది రోజులపాటు ప్రక్రియ కొనసాగనుంది. బ్యాంకులు, వడ్డీవ్యాపారుల చుట్టూ తిరగాల్సిన బాధ తప్పడం, సీజన్‌కు ముందే డబ్బులు వస్తుండడంతో అన్నదాతలు సంతోషంగా ‘సాగు’తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా వానకాలం సీజన్‌కు గాను 6,09,464 మంది రైతులకు రూ.860.42 కోట్ల సాయం అందనుంది. కాగా.. ఈసారి పోడు రైతులకు కూడా పెట్టుబడి సాయం రానుంది.
వానకాలం సాగుకు సన్నద్ధం అవుతున్న రైతన్నకు రేపటి(సోమవారం) నుంచి రైతుబంధు సాయాన్ని అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పది రోజుల్లోగా రైతుల ఖాతా ల్లో డబ్బులు జమ చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. మే 2018లో సీఎం కేసీఆర్ రైతుబంధు పథకాన్ని ప్రారంభించారు. తొలుత ఎకరాకు రూ.4 వేల చొప్పున రెండు పంటలకు ఏడాదికి రూ.8 వేలు అందించారు. గత శాసనసభ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఎకరాకు రూ.5వేల చొప్పున రెండు పంటలకు ఏడాదికి రూ.10 వేలు అందిస్తామని రైతులకు హామీ ఇచ్చారు. హామీ ప్రకారం ఎకరాకు రూ.5 వేల చొప్పున నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేయిస్తున్నారు. ఇప్పటివరకు పది సీజన్లు సాయం అందించగా.. ప్రస్తుతం వానకాలం పంటకు 11వ విడుత అందించేందుకు అధికారులు సిద్ధం చేశారు. కాగా.. ఈ వానకాలానికి సంబంధించి కొత్తగా అర్హులైన రైతుల జాబితాను అధికారులు ప్రభుత్వానికి అందజేశారు. ఈ నెల 16వ తేదీ లోపు కొత్తగా పట్టా పాసుబుక్ పొందిన వారు రైతుబంధు కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. కాగా.. ఈ సారి సాగు కోసం ఉమ్మడి జిల్లాలోని 6,09,464 మంది రైతుల ఖాతాల్లో రూ.860.42 కోట్లు జమ చేయనున్నారు. పోడు భూములకూ అందేలా చూడాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు నిర్మల్ జిల్లా పరిధిలో 14,068 ఎకరాలను పంపిణీ చేయనున్నారు. 5,204 పట్టా పాస్ పుస్తకాలను ఇప్పటికే రెడీ చేశారు. త్వరలోనే పోడు రైతులకు ఈ పట్టాలను అందజేసి, రైతుబంధు సాయాన్ని అందించనున్నారు.
6.09 లక్షల మందికి సాయం..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 6,09,464 మంది రైతులకు రైతుబంధు వర్తించనున్నది. నిర్మల్ జిల్లాలో 1,88,317 మందికి రూ.228 కోట్లు, ఆదిలాబాద్‌లో 1.46, 218 మందికి రూ.268.34 కోట్లు, ఆసిఫాబాద్‌లో 1,14,973 మందికి రూ.191.09 కోట్లు, మంచిర్యాలలో 1,59,956 మందికి రూ.172.99 కోట్లు వానకాలం రైతుబంధు కింద పెట్టుబడి సాయం అందించనున్నారు. కాగా.. కొత్తగా భూములు కొన్న రైతులు రైతుబంధు కోసం దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు. ఈనెల 16వ తేదీలోపు కొత్తగా భూమి కొనుగోలు చేసి.. పట్టాదారు పుస్తకం లేదా ఆఫీసు కాపీ వచ్చిన రైతులు వచ్చే నెల 3వ తేదీ లోపు అధికారులను సంప్రదించి తమ దరఖాస్తును అందజేయాలి. గడువులోపు దరఖాస్తు చేసుకున్న రైతులందరికీ వానకాలం పంటకు రైతుబంధు సాయం అందుతుందని అధికారులు చెబుతున్నారు.