ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా పది రోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతుండడంతో జనజీవనం స్తంభించింది. వాగలు, వంకలు పొంగి పొర్లుతుండడంతో రాకపోకలు నిలిచాయి. చెరువులు మత్తడి దుంకుతుండగా.. జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. ప్రాజెక్టుల్లోకి వరద చేరుతుండడంతో గేట్లు ఎత్తి దిగువనకు నీటిని వదులుతున్నారు. జలపాతాలు ప్రకృతి ప్రేమికులను కనువిందు చేస్తున్నాయి. మంచిర్యాల జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి నుంచి ముసురు పడుతుండగా.. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లో వరుణుడు గెరువిచ్చాడు.
మంచిర్యాల, జూలై 26(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పది రోజులుగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా కొంతమేర తగ్గినా.. మంగళవారం అర్ధరాత్రి నుంచి మంచిర్యాల జిల్లాను ముసురు కమ్మేసింది. బుధవారం ఉదయం నాటికి జిల్లాలో సగటు వర్షపాతం 11.2 మిల్లీమీటర్లుగా నమోదైంది. చెన్నూర్‌లో అత్యధికంగా 36.8, కోటపల్లిలో 21.7, జైపూర్, భీమారం, నెన్నెలలో 18 మిల్లీ మీటర్లు పడింది. ఆదిలాబాద్ జిల్లాలో సగటు వర్షపాతం 5.1 మిల్లీమీటర్లు ఉండగా.. గడిగూడలో 16.6, బేలలో 10.6 మిల్లీమీటర్లు కురిసింది. ఆసిఫాబాద్ జిల్లాలో సగటు వర్షపాతం 4.8 మిల్లీమీటర్లు ఉండగా అత్యధికంగా కెరమెరిలో 15.5, పెంచికల్‌పేటలో 13.2 మిల్లీమీటర్లు పడింది.
నిర్మల్ జిల్లాలో సగటు వర్షపాతం 2.5 మిల్లీమీటర్లు ఉండగా.. కడ్డెం పెద్దూర్లో 12.7 మిల్లీమీటర్ల అత్యధిక వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ తెలిపింది. జిల్లాల్లో చెరువులు జలకళను సంతరించుకున్నాయి. మంచిర్యాల జిల్లాలో 852 చెరువులు ఉండగా.. వీటిలో 466 చెరువులు 100 శాతం నిండాయి. ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 450 చెరువులకు దాదాపు అన్ని నిండాయి. 300 పైగా చెరువులు మత్తడి దుంకుతున్నాయి. నిర్మల్ జిల్లాలో 613 చెరువులు ఉండగా.. 450 పూర్తిస్థాయిలో నిండాయి. ఆసిఫాబాద్ జిల్లాలో 563 చెరువులు ఉండగా, దాదాపు 180 చెరువులు నిండి కొన్ని చోట్ల మత్తడి పోస్తున్నాయి. కాగా.. ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచింది.
నిండుకుండల్లా ప్రాజెక్టులు
ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్టులన్నీ నిండుకుండలను తలపిస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో సాత్నాల ప్రాజెక్టులో 284 మీటర్ల నీరు ఉండగా.. 250 క్యూసెక్కుల ఇన్ ఫ్లో, 50 క్యూసెక్కుల అవుట్ ఫ్లో ఉంది. మత్తడివాగు ప్రాజెక్టులో 276 మీటర్ల నీరు ఉండగా,110 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. ఇక్కడ బయటికి నీటిని వదలడం లేదు. చనాక- కొరాట బ్యారేజ్‌లోకి 46,995 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా.. అదే మొత్తం కిందికి వెళ్లిపోతున్నది. నిర్మల్ జిల్లా గడ్డెన్నవాగు ప్రాజెక్ట్‌లో 357.6 మీటర్ల నీరు ఉండగా 1,200 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉంది. స్వర్ణ ప్రాజెక్ట్‌లో 1,179.2 అడుగుల మేర నీరు ఉండగా.. ప్రస్తుతం 500 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. కడెం ప్రాజెక్టులో 700 అడుగుల మేర నీరు ఉండగా 7,095 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉంది.
ఒక్క గేట్ ద్వారా 1,184 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కుమ్రం భీం ప్రాజెక్ట్‌లో 237 మీటర్ల వరకు నీరు చేరింది. 3,200 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా రెండు గేట్లను ఎత్తి అదే స్థాయిలో నీటిని వదులుతున్నారు. మంచిర్యాల జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్ట్ పూర్తిస్థాయిలో నిండింది. ప్రస్తుతం 99,079 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా 16 గేట్లను ఎత్తి అదే స్థాయిలో నీటిని కిందకు వదులుతున్నారు. అన్నారం బ్యారేజీలో 108 మీటర్ల నీరు ఉండగా 94,211 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. 40 గేట్లను ఎత్తి 1,28,211 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. వేమనపల్లి మండలంలోని నీల్వాయి ప్రాజెక్ట్ మత్తడి దుంకుతోంది. 2,685 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా, దాదాపు 400 క్యూసెక్కుల వరద బయటికి వెళ్తోంది.
పొంగి ప్రవహిస్తున్న వాగులు..
నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. మంచిర్యాల జిల్లా కేంద్రం మీదుగా వెళ్లే రాళ్లవాగు ఉప్పొంగింది. రంగంపేట బ్రిడ్జి మీద నుంచి నీరు పారుతోంది. తోళ్ల వాగులోనూ స్థిరంగా నీటి ప్రవాహం కొనసాగుతోంది. చెన్నూర్‌లోని బతుకమ్మ వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. నెన్నెల సమీపంలోని లంబాడీతండా వద్ద ఎర్రవాగు పొంగడంతో ఆ మార్గం మీదుగా రాకపోకలను నిలిపివేశారు. తాండూర్ మండలంలోని అంకెపల్లి శివారులో గల చెరువు తూము కుంగిపోయి గండిపడింది. అధికారులు, గ్రామస్తులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. ఇక ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలోని జలపాతాలన్నీ నీటితో కనువిందు చేస్తున్నాయి.
Rain5