కుమ్రం భీం ఆసిఫాబాద్, జనవరి 5(నమస్తే తెలంగాణ) : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సోమవారం ఎమ్మెల్సీ కవిత పర్యటించనున్నారు. ఇందుకోసం బీఆర్ఎస్ శ్రేణులు భారీ ఏర్పా ట్లు చేశాయి. రహదారులన్నీ పోస్టర్లు, ఫ్లెక్సీలతో నిండి గులాబీ మయంగా మారాయి. మొదటగా ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పిస్తారు. అనంతరం జైనూర్ మండలంలోని నార్నూర్ ఎక్స్ రోడ్డు నుంచి రెబ్బెన మండలంలోని గోలేటి వరకు దాదాపు 120 కిలోమీటర్ల మేర బైక్‌ర్యాలీ కొనసాగనుంది. జైనూర్ మండలంలోని దేవునిగూడలో ఆటోడ్రైవర్ చేతిలో హత్యాయత్నానికి గురైన మెస్రం నీలాబాయిని పరామర్శిస్తారు.
అనంతరం జైనూర్ మండల కేంద్రంలోని ఆసుపత్రి, బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శిస్తారు. వాంకిడి మండలంలోని దాబా గ్రామానికి చెందిన విద్యార్థి శైలజ విష ఆహారం బారిన పడి మరణించిన విషయం తెలిసిందే. వీరి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. రాష్ర్టంలోనే సంచలనం కలిగించిన రెండు ఘటనల్లో బాధిత కుటుంబాలకు ఆరు నెలలు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి పైసా రాలేదు. అనంతరం గోలేటిలో సింగరేణి కార్మికులతో సమావేశం నిర్వహించి, కార్మికుల నుంచి సమస్యలను తెలుసుకుంటారు.
చావు అంచుల దాకా వెళ్లిన నీలాబాయి
ఆటోడ్రైవర్ చేతిలో హత్యాయత్నానికి గురైన నీలాబాయి చావు అంచుల దాకా వెళ్లింది. ఈ ఘటనతో ఆవేశానికి గురైన ఆదివాసులు జైనూర్ మండలంలోని ఓ వర్గానికి చెందిన వ్యాపార సముదాయాలకు నిప్పుపెట్టి ధ్వంసం చేశారు. దాదాపు మూడు నెలలపాటు పోలీసులు కట్టుదిట్టమైన ఆంక్షలు విధించారు. ఇరువర్గాల వారిని కట్టడిచేసి శాంతిని నెలకొల్పేందుకు కఠిన చర్యలను అమలు చేశారు. ఈ ఘటన జరిగి దాదాపు ఆరు నెలలు గడుస్తున్నప్పటికీ జైనూర్పై పోలీసుల నిఘా కొనసాగుతూనే ఉంది.
ఆర్థిక సహాయం అందలేదు : నీలాబాయి
నాపై దాడి జరిగి దాదాపు ఆరు నెలలు గడుస్తున్నప్పటికీ ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందలేదు. నా కొడుకు ప్రవీణ్‌కుమార్‌కు నామమాత్రంగా కెరమెరిలోని హట్టిలో గల ఆశ్రమ పాఠశాలలో ఔట్సోర్సింగ్ పని కల్పించారు. రోజు వారి కూలీగా పనిచేసుకుంటూ జీవించే నాపై హత్యాయత్నం జరిగిన తరువాత కోలుకునేందుకు మూడు నెలలు పట్టింది. నాపై హత్యాయత్నం చేసినప్పుడు తగిలిన గాయాలు ఇప్పటికీ బాధిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలి. పక్కా ఇల్లు ఇవ్వాలని కోరుతున్నా.
25 రోజులు వెంటిలేటర్‌పై ఉండి..
వాంకిడి బాలికల ఆశ్రమ పాఠశాలలో విష ఆహారం తిని దాదాపు 60 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఇందులో తొమ్మిదో తరగతి విద్యార్థిని శైలజ ప్రాణాపాయ స్థితిలో దాదాపు 25 రోజులపా టు హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ మృతి చెందింది. కట్టుదిట్టమైన భద్రత మధ్య శైలజ అంత్యక్రియలు నిర్వహించారు. శైలజ మరణంతో విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. దీంతో ప్రభుత్వం వారి కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చింది. కానీ, ఇప్పటివరకు సహాయం అందలేదని కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు.
ఆదుకోవాలి..
మా బిడ్డ చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న మాకు ప్రభుత్వం నుంచి సహాయం అందలేదు. మా బిడ్డ అంత్యక్రియలను కూడా పోలీసు లు బలవంతంగా నిర్వహించారు. ఆ సమయంలో మాకు రూ.50 లక్షలు, మా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, పక్కా ఇల్లు, ఐదెకరాల భూమి కావాలని అడి గాం. వీటిలో ఏ ఒక్కటి కూడా ప్రభుత్వం నెరవేర్చలేదు. ఐటీడీఏ డీడీ రూ.2 లక్షలు, ఎమ్మెల్సీ దండె విఠల్ రూ.లక్ష ఇచ్చారు. అంత్యక్రియల కోసం రూ. లక్ష ఇచ్చారు. బొంబా రలోని ఆశ్రమ పాఠశాలలో విద్యార్థిని తండ్రి తుకారాంకు ఔట్‌సోర్సింగ్‌లో పని కల్పించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలి.
– శైలజ తల్లి మీరాబాయి