“అవ్వ బాగున్నవా.. ఏ ఊరూ.. ఎంత మంది కొడుకులు, బిడ్డలు.. ఎన్నెకరాల భూముంది.. ఏ ఏ పంటలు వేసినవ్.. ఈ వానలకు ఏమైనా దెబ్బతిన్నయా.. చేలలో నీరు నిలిచిందా.. ఏమైనా ఉంటే చెప్పు.. సీఎం సారుకు చెప్తా.. సారు మనల్ని ఆదుకుంటడు..” అని ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలిస్తూ బాధితులకు భరోసానిస్తున్నారు. మన సర్కారుంది.. గతంలో కూడా ఆదుకుంది. ఇప్పుడు కూడా ఆదుకుంటుంది.. అనే కొండంత ధైర్యాన్ని నింపుతున్నారు. కాగా.. ఆదివారం ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని సాత్నాల ప్రాజెక్టు ముంపు ప్రాంతాలతోపాటు పెన్‌గంగ నదీ పరీవాహక ప్రాంతాలను ఎమ్మెల్యే జోగు రామన్న పరిశీలించారు. నిర్మల్ జిల్లా తానూర్ మండలంలో కూలిన ఇళ్లు, దెబ్బతిన్న పంటలు, తెగిన చెరువులు, కోతకు గురైన రోడ్లను ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి పరిశీలించారు. బాధితులతో మమేకమై వారి గోడు విన్నారు. ఆదుకుంటామనే భరోసా ఇచ్చారు.
తానూర్, జూలై 30 : వరద బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి అన్నారు. మండలంలోని బోల్సా, బెంబర్, హిప్నెల్లి, జవులా(కే), వడ్గాం, ఎల్వత్, నంద్‌గావ్ గ్రామాల్లో ఎమ్మెల్యే ఆదివారం పర్యటించారు. భారీ వర్షాలకు కూలిన ఇండ్లు, దెబ్బతిన్న పంట చేన్లు, తెగిన చెరువులు, రోడ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో పంట నష్టం జరిగిన రైతుల వివరాలను వ్యవసాయ విస్తరణాధికారులు సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక అందిస్తారన్నారు. వరద ప్రభావంతో నష్టపోయిన బాధితులకు బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని అధైర్య పడొద్దని భరోసా ఇచ్చారు. చెరువు కట్టలు, రోడ్ల మరమ్మతుకు ప్రత్యేక నిధుల కోసం ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పారు. త్వరలో దెబ్బతిన్న రోడ్లు, చెరువులను, కుంటలకు మరమ్మతు చేపట్టేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఐడీసీ చైర్మన్ వేణుగోపాలచారి, హంగిర్గా సొసైటీ చైర్మన్ నారాయణ్రావుపటేల్, ఆత్మ చైర్మన్ (బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు) కానుగంటి పోతారెడ్డి, మాజీ జట్పీటీసీ ఉత్తమ్ బాలేరావ్, మాజీ ఎంపీపీ బాశెట్టి రాజన్న, బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు చంద్రకాంత్ యాదవ్, మండల కోఆప్షన్ సభ్యుడు గోవింద్రావు పటేల్, సర్పంచ్‌లు శ్యాంరావ్ పటేల్, విఠాబాయి హన్మండ్లు, అబ్దుల్గని, సంతోష్పటేల్, బాలాజీ నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, అంకంవార్ సాయినాథ్, లస్మన్న, లక్ష్మణ్, భీంపవార్, లక్ష్మణ్ ఆయా గ్రామల ప్రజలు పాల్గొన్నారు.
రైతులకు అండగా ప్రభుత్వం
ముథోల్, జూలై 30 : రైతులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. ముథోల్ నుంచి ధర్మాబాద్‌కు బైపాస్ వెళ్లే రోడ్డును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొలాలకు వెళ్లే రైతులకు ఇబ్బందులు కలగకుండా త్వరలో రోడ్డుకు మరమ్మతులు చేయిస్తానని హామీ ఇచ్చారు. అలాగే వాగు పొంగి పంట నష్టపోయిన రైతులు అధైర్యపడొద్దని ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. ముథోల్‌లోని సాయిమాధవ్ నగర్లో ఇబ్బందులు పడ్డ ప్రజలకు ప్రభుత్వం తరఫున రోడ్డు మరమ్మతులు చేయిస్తానని హామీ ఇచ్చారు. భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బస్టాండ్ సమీపం నుంచి మహాలక్ష్మీ ఆలయం వరకు కొట్టుకపోయిన రోడ్డును సైతం బాగు చేయించేందుకు చర్యలు చేపడుతామన్నారు. ఆయన వెంట పీఏసీఎస్ మాజీ చైర్మన్ సురేందర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ పోతన్న యాదవ్, ఎంపీటీసీ సరళాశ్రీనివాస్, కోఆప్షన్ సభ్యుడు మగ్దూమ్, వార్డుసభ్యుడు బాబు, నాయకులు విశ్వంబర్, రైతులు ఉన్నారు.
ట్రైబల్ హాస్టల్‌ని పరిశీలించిన ఎమ్మెల్యే
ముథోల్‌లోని ట్రైబల్ వెల్ఫెర్ బాలికల హాస్టల్‌ను ఆదివారం ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పరిశీలించారు. అధిక వర్షాలతో ప్రహరీ కూలిందని హాస్టల్ సిబ్బంది ఆయనకు వివరించారు. త్వరలోనే ప్రహరీ నిర్మించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆయన వెంట ప్రజాప్రతినిధులు, నాయకులు ఉన్నారు.