జైనూర్, : కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్( Jainoor ) మండల కేంద్రంలో రూ.1.25 కోట్ల తో నిర్మించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం, 12 సముదాయ భవనాలను ( Market Committee Buildings) జిల్లా కలెక్టర్ కె. హరిత( Haritha ), ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ( MLA Kova Laxmi), ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ( MLA Vedma Bojju Patel ) ప్రారంభించారు. అనంతరం ఈజీఎస్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ మార్కెట్ కమిటీ కార్యాలయంతో పాటు 12 సముదాయ గదుల నిర్మాణం ద్వారా కమిటీకి ఆదాయం సమకూరుతుందని తెలిపారు. రైతులు వ్యవసాయ సాగులో రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ ఎరువులపై దృష్టి సారించాలని సూచించారు. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా అసలు రసీదులు తీసుకుని పంట కాలం ముగిసే వరకు భద్రపరచుకోవాలని సూచించారు.
నకిలీ విత్తనాల నియంత్రణకు వ్యవసాయ శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టి రైతులకు అవగాహన కల్పించాలని ఎమ్మెల్యేలు కోరారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమెత విశ్వనాథ్ రావు, వైస్ చైర్మన్ బానోత్ జైవంత్ రావు, జిల్లా వ్యవసాయ అధికారి వెంకట్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కామెడె అనిల్, జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ కనక యాదవ్ రావు, ఎంపీడీవో సుధాకర్ రెడ్డి, తహసీల్దార్ ఆడ బిర్షవ్, మార్కెట్ కమిటీ కార్యదర్శి ఇర్ఫాన్ అహ్మద్ ఖాన్, ఇంతియాజులాల, ముందే సతీష్, మడవి భీమ్రావు, చిర్లే లక్ష్మణ్, మిశ్రమం అంబాజీరావు, ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు, వివిధ గ్రామ పంచాయతీల సర్పంచులు నాయకులు పాల్గొన్నారు.