నేరడిగొండ, జనవరి 2 : ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని సావర్గాం గ్రామంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మంజూరైన రూ.20 లక్షల నిధులతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే జాదవ్ అనిల్‌కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే గ్రామాల రూపురేఖలు మారిపోయాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల పేరిట కాలయాపన చేయడం తప్పా చేసేదేమి లేదని ఆరోపించారు. ముందుగా ఎమ్మెల్యే స్వగ్రామమైన రాజురాలో జగదాంబాదేవి సేవాలాల్ మహారాజ్ ఆలయంలో పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సజన్, వైస్ ఎంపీపీ మహేందర్‌రెడ్డి, సర్పంచ్‌లు వెంకటరమణ, జాదవ్ కల్యాణి, అనూష, నాయకులు దేవేందర్‌రెడ్డి, శివారెడ్డి, రవీందర్‌రెడ్డి, గడ్డం భీంరెడ్డి, మహేందర్, పవన్, శ్రీనివాస్ రెడ్డి, రమేశ్ పాల్గొన్నారు.
ఇబ్బంది కలుగకుండా చూడాలి..
ఇచ్చోడ, జనవరి 2 : ప్రజాపాలనలో వచ్చే దరఖాస్తుదారులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూడాలని అధికారులను ఎమ్మెల్యే జాదవ్ అనిల్‌కుమార్ ఆదేశించారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభను సందర్శించారు. దరఖాస్తు ఫారాలు అందరికీ సరిపోయే విధంగా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాంప్రసాద్, తహసీల్దార్ తుకారాం పాల్గొన్నారు.