జన్నారం, ఏప్రిల్ 10 : తొమ్మిదేళ్లలో రాష్ట్రం ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి మరోసారి అండగా నిలవాలని ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్ పిలుపునిచ్చారు. సోమవారం మండల కేంద్రంలోని పైడిపల్లి ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే రేఖానాయక్ అధ్యక్షతన నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొదట సీఎం కేసీఆర్ పంపిన సందేశాన్ని చదివి వినిపించారు. నలుగురు గ్రామ కమిటీల అధ్యక్షులు ఆయా గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనుల గురించి వివరించారు. అనంతరం ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్ మాట్లాడుతూ తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలకు పక్క రాష్ర్టాల ప్రజలు ఆకర్షితులవుతున్నారని, బీఆర్ఎస్తోనే దేశ ప్రగతి సాధమని భావిస్తున్నారని చెప్పారు. బీజేపీ ప్రభు త్వం తెలంగాణపై కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నదని, ఎంపీ ప్రారంభించాల్సిన వందేభారత్ రైలును ప్రధాని ప్రారంభించి గొప్పలు చెప్పుకోవడమేమిటని, ఇది వారి దిగజారుడు తనానికి నిదర్శమని విమర్శించారు.
తెలంగాణలో అమలవుతున్న పథకాలను బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అమలు చేసిన తర్వాతే ఇక్కడికి వచ్చి ఓట్లు అడుగాలన్నారు. దేశంలోని అన్ని రాష్ర్టాలను అభివృద్ధి చేసే లక్ష్యంతోనే బీఆర్ఎస్ ఏర్పడిందని, ఓర్వలేని ప్రధాని సీబీఐ, ఈడీల పేరిట బీఆర్ఎస్ నాయకులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలంతా గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఎమ్మెల్యే రేఖానాయక్ మాట్లాడుతూ ఎవ్వరు అడుగకున్నా దళితబంధు, 24 గంటల ఉచిత కరెంట్, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్వంటి పథకాలు అమలు చేస్తున్న ఘ నత సీఎం కేసీఆర్‌దేనని కొనియాడారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పథకాలు అమలు చేస్తున్నామని, ఓట్లు అడిగే హక్కు తమ పార్టీకే ఉందని చెప్పారు. రైతుబంధు సమితి జిల్లా డైరెక్టర్ సిటిమల భరత్‌కుమార్ మాట్లాడుతూ ప్రజలంతా బీఆర్ఎస్ వెంటే ఉన్నారని, కేసీఆర్ ముడోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సీపతి పద్మ, వైస్ ఎంపీపీ సుతారి వినయ్, పార్టీ మండల అధ్యక్షుడు గుర్రం రాజారాంరెడ్డి, ప్రధాన కార్యదర్శి సులువ జనార్దన్, కో ఆప్షన్ సభ్యుడు మున్వర్అలీఖాన్, పొనకల్ సింగిల్ విండో చైర్మన్ శ్రీలం రమేశ్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు జాడి గంగాధర్, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షులు మహ్మద్రియాజొద్దీన్, నాసాని రాజన్న, టౌన్ అధ్యక్షుడు బాలసాని శ్రీనివాస్‌గౌడ్, కాంతమణి, సుశీల, సులోచన, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.