మంచిర్యాలటౌన్, జనవరి 20 : అధికారుల ముందుచూపులేని తనంతో పట్టణ ప్రజలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి దాపురించింది. మంచిర్యాల పట్టణ ప్రజలకు ప్రతిరోజూ తాగునీరందించాలన్న ఉద్దేశంతో ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు.. మున్సిపల్, మిషన్ భగీరథ అధికారులతో సమావేశమై లాంఛనంగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ మేరకు మిషన్ భగీరథ అధికారులు నిర్మించిన సంప్ నుంచి జలగుట్ట పైనున్న ట్యాంకులోకి నీటిని ఎక్కించి.. అక్కడి నుంచి పట్టణంలోని ట్యాంకులకు గ్రావిటీ ద్వారా పంపింగ్ చేస్తున్నారు.
ముల్కల్ల పంప్‌హౌస్ నుంచి వచ్చే నీటి ప్రవాహాన్ని ఇన్ని రోజులు తట్టుకున్న ఏసీ పాత పైపులు.. ప్రస్తుతం గ్రావిటీతో వస్తున్న నీటి ప్రవాహాన్ని మాత్రం తట్టుకోలేక పగిలిపోతున్నాయి. గడిచిన నాలుగురోజుల్లో ఇప్పటికే మూడు ప్రాంతాల్లో పైపులు పగిలిపోయాయి. వాటిని మున్సిపల్ అధికారులు మరమ్మతులు చేస్తున్నారు. కాగా.. మిషన్ భగీరథ అధికారులు డీఐ పైపులు వేసి దాదాపు నాలుగేళ్లు అవుతుంది. త్వరలోనే వాటికి కనెక్షన్లు ఇస్తామని చెబుతున్నారు.
ఓ పక్క పాతపైపులు పగిలిపోవడం, ఇప్పటికే వేసి ఉన్న మిషన్ భగీరథ పైపులు పనిచేస్తాయో లేదో తెలియని పరిస్థితుల నేపథ్యంలో తాగు నీరందేదెలా అన్న ప్రశ్న తలెత్తుతున్నది. ఇక పైపులు పగిలిన చోట మరమ్మతులకోసం రోజుల తరబడి తెరిచి ఉం చడం వల్ల తాగునీరు కలుషితమయ్యే ప్రమాదం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.