ఆసిఫాబాద్ అంబేదర్ చౌక్, ఫిబ్రవరి 16 : సరస్వతీ శిశు మందిరాలు సంస్కృతికి నిలయాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, శిశు మందిర్ విద్యాపీఠం దక్షిణ మధ్య క్షేత్రం సంఘటన కార్యదర్శి లింగం సుధాకర్ రెడ్డి పేరొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని స్థానిక సరస్వతీ శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో 1979-2024 వరకు చదువుకున్న విద్యార్థుల మహా సమ్మేళనం జరిగింది. ఎమ్మెల్యేతో పాటు లింగం సుధాకర్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు.
మనిషి వికసించాలంటే చదువుతో పాటు క్రమశిక్షణ అవసరమన్నారు. మాజీ జడ్పీటీసీ సభ్యుడు అరిగేలా నాగేశ్వర్రావు మాట్లాడుతూ తమ పిల్లలు శిశు మందిర్‌లో చదివి విదేశాల్లో స్థిరపడి మంచి పేరు తెచ్చుకున్నారన్నారు. అంతకుముందు పూర్వ విద్యార్థులంతా ఓకేచోట చేరి ఆత్మీయంగా పలకరించుకున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ సందర్భంగా విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందజేశారు.
కాగా, అమెరికా నుంచి గోపికృష్ణ అనే పూర్వ విద్యార్థి పాల్గొనడం విశేషం. ఈ కార్యక్రమంలో శిశు మందిర్ పాఠశాల పూర్వ విద్యార్థి పరిషత్ నాయకులు బొడ్డు శ్రీనివాస్, రాజ రెడ్డి, శిశు మందిర్ పాఠశాల అధ్యక్షుడు చిలువేరు వెంకటేశ్, డాక్టర్ విష్ణువర్ధన్‌రావు, శిశు మందిర్ పాఠశాల ప్రథమ ప్రధానోపాధ్యాయుడు సుధాకర్, బోనగిరి సతీశ్, వెంకటేశ్వర్లు, శిశు మందిర్ పాఠశాల ప్రధానాచార్యులు, ఆచార్యులు, తదితరులు పాల్గొన్నారు.