కుమ్రం భీం ఆసిఫాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ) : అధికారులు ప్రజా సమస్యల పరిష్కారం కోసం కాకుండా కేవలం కాంగ్రె స్ పార్టీ నాయకుల కోసమే పని చేస్తున్నారని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి పేర్కొన్నారు. ప్రజా పాలన-ప్రగతి నివేదిక 99 ప్రణాళికలో భాగంగా శనివారం కలెక్టరేట్ లో కలెక్టర్ హరిత, అదనపు కలెక్టర్ డేవిడ్ తో కలిసి నిర్వహించిన సమీక్షలో ఆమె అధికారుల తీరుపై మండిపడ్డారు. ఉపాధి హా మీ నిధులతో చేసిన అభివృద్ధి పనులకు సం బంధించిన ప్రొసిడింగ్లు ఎమ్మెల్యేకు కా కుండా కాంగ్రెస్ పార్టీ నాయకులకు అధికారులు ఇవ్వడంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రొటోకాల్ ప్రకారం అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రొసిడింగ్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎన్నికల్లో ఓడిపోయిన వారికి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. అధికారుల తీరుతో అనేక గ్రామాల్లో ఎన్ఆర్ఈజీస్ ద్వారా అభివృద్ధి పనులు జరుగకుండా ఆగిపోయాయని ఎమ్మెల్యే ఆరోపించారు. సింగరేణి ప్రాంతం ఎక్కువగా ఉన్న ఆసిఫాబాద్ నియోజకవర్గంలో రూ. 70 నుంచి రూ. 80 కోట్ల సింగరేణి నిధులు రావాల్సి ఉందన్నారు. నిధులు వచ్చిన ప్రాంతాల్లో కూడా కనీస వసతులు కల్పించడం లేదన్నారు. సింగరేణి నుంచి వచ్చే డీఎంఎఫ్టీ నిధులతో ఆసిఫాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకుండా ఇతర ప్రాంతాలకు నిధులను తరలించికొని పోతున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు.
ఆసిఫాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న తనకు నిధుల స మాచారం తెలుపకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ఎమ్మెల్యేకు ప్రొసిడింగ్‌లను ఇస్తున్నారన్నారు. ఆసిఫాబాద్ నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు వస్తే, ఇప్పటి వరకు ఎన్ని పూర్తిచేశారని అధికారులను ప్రశ్నించారు. అటవీ అధికారుల తీరువల్ల చాలా గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ఆగిపోయిందని, చాలా వరకూ గి రిజన గ్రామాల్లో అటవీ అధికారులు ఇండ్ల ను నిర్మించకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. వందేళ్లకు పూర్వం ఏర్పడిన గిరిజన గ్రామాల్లోనూ అటవీ అధికారులు ఆంక్షలు విధిస్తూ అభివృద్ధి పనులు జరుగకుండా అడ్డుకుంటున్నారని, కనీసం రోడ్లు, నీటి వసతి కోసం బోర్లు కూడా వేయనీయ డం లేదని ఎమ్మెల్యే ఆరోపించారు.
కాంగ్రె స్ పాలన పారంభమైనప్పటి నుంచి ఆసిఫాబాద్ నియోజవర్గానికి నిధులు రావడం లేదని అన్నారు. అనేక గ్రామాల్లో తాగునీటి సమస్యలు ఉన్నాయని, రోడ్లు కూడా లేవని, కనీసం అంబులెన్స్‌లు కూడా వెళ్లలేని పరిస్థితి ఉందన్నారు. ప్రగతి పాలన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తూ ప్రజలను మభ్యపెడుతోందన్నారు. గ్రామాల్లో కనీస వసతులు కూడా కల్పించడం లేదని ఆరోపించారు. సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల పథకం కేవలం ప్రకటనలకే పరిమితమైందన్నారు. జిల్లాలో ఎంతమందికి సబ్సిడీ గ్యాస్ అందుతుందో తెలియజేయాలని ప్రస్తావించడంతో కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యేను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో సమావేశంలో గందరగోళం నెలకొంది. దీంతో అధికారులు సమావేశాన్ని ముగించేశారు.